బీఆర్‌‌ఎస్‌ పక్కదారి!

బీఆర్‌‌ఎస్‌ పక్కదారి!

బీఆర్‌‌ఎస్‌ పక్కదారి!
అసైన్డ్ భూముల్లో వెలుస్తున్న అక్రమ కట్టడాలు
సడలింపు ఆసరాగా తీసుకొని టెంపరరీ ఇండ్లు, డబ్బాల ఏర్పాటు 

ఇంటి పన్నులు రశీదు ఇవ్వాలని పంచాయితీ సెక్రటరీలపై ఒత్తిడి

మెదక్​, పాపన్నపేట, వెలుగు: బిల్డింగ్​ రెగ్యులరైజేషన్ ​స్కీం పక్కదారి పడుతోంది. కొందరు వ్యక్తులు ప్రభుత్వం సడలింపు ఇవ్వడాన్ని ఆసరాగా తీసుకుని అసైన్డ్​ భూముల్లో టెంపరరీ ఇండ్లు, డబ్బాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటికి ఇంటి నెంబర్, పన్నులకు సంబంధించిన రసీదులు ఇవ్వాలని పంచాయతీ సెక్రటరీలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారమంతా పొలిటికల్ లీడర్ల కనుసన్ననల్లో నడుస్తుండడంతో రెవెన్యూ, పంచాయతీ రాజ్​ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. 


280 ఎకరాల అసైన్డ్ భూమి 

పాపన్నపేట మండలంలోని పొడ్చన్ పల్లి  తండా, శానాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్​1,168లో 280 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూమి మెదక్ --బొడ్మట్ పల్లి మెయిన్​ రోడ్డు  పక్కనే ఉండడంతో కొందరు లీడర్లు కన్ను వేశారు. నిబంధనల ప్రకారం ఈ భూమి అమ్మే, కొనే అవకాశం లేకపోవడంతో నోటరీ డాక్యుమెంట్‌పై గుంటల చొప్పున అమ్మకాలు మొదలుపెట్టారు.  ఇలా గుంటల లెక్కన భూమి కొన్న వారు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన సడలింపును ఆసరాగా చేసుకుని టెంపరరీ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు.  సిమెంట్‌ ఇటుకలు తీసుకొచ్చి నాలుగు రోజుల్లో ఇక్కడ దాదాపు యాబై ఇండ్లు నిర్మించడం గమనార్హం.  రెవెన్యూ, పంచాయతీ అధికారులు రోజూ ఇదే రూట్లో రాకపోకలు సాగిస్తున్నా అక్రమ నిర్మాణాల గురించి పట్టించుకోవడం లేదు.  
 

పాత తేదీల్లో పన్ను రసీదులు

ప్రభుత్వం 58, 59 జీవోల ప్రకారం..125 చదరపు గజాల లోపు స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలకైతే ఫ్రీగా, అంతకన్న ఎక్కువ విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకున్నట్టయితే మార్కెట్​ రేటు కట్టించుకుని రెగ్యులరైజ్​చేయాలని నిర్ణయించింది. 2014 జూన్​ 2 లోపు సంబంధిత స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నవారు ఇందుకు అర్హులని అప్పట్లో ప్రకటించింది. ఈ మేరకు గతంలో రెండుసార్లు దరఖాస్తులు స్వీకరించడంతో పాటు ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి అర్హులను గుర్తించి రెగ్యులరైజ్ చేశారు. కాగా, ఈ స్కీం నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం గత నెల 17న కొత్త జీవో జారీ చేసింది. దీని ప్రకారం 2020 జూన్​ 2వ తేదీ లోపు అసైన్డ్​ భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన వారు రెగ్యులరైజేషన్ ​కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నిర్ణీత గడువులోగా అక్కడ నిర్మాణాలు జరిగినట్టు తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.  ఇందుకోసం పాత తేదీల్లో ఇంటి పన్ను చెల్లించినట్టు రసీదులు పొందేందుకు అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పంచాయతీ సెక్రటరీలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలిసింది. 

మంబోజిపల్లిలోనూ...

జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణానికి సమీపంలోని మంబోజిపల్లి లోనూ అసైన్డ్​ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.  రెగ్యులరైజేషన్​ స్కీంకు ప్రభుత్వం సడలింపు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ మెదక్​ - హైదరాబాద్‌ నేషనల్​ హైవే వెంట అసైన్డ్​ భూముల్లో సిమెంట్​ ఇటుకలతో టెంపరరీ ఇళ్లు, డబ్బాలు వెలుస్తున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల, నాయకుల అండతోనే  ఈ దందా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.   
చర్యలు తీసుకుంటం
పొడ్చన్​పల్లి తండా పరిధిలో సర్వే నెంబర్​1,168లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న విషయం వాస్తవమే. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటం.  
- మహేందర్​, పాపన్నపేట తహసీల్దార్​
నోటీసులు ఇస్తం
పొడ్చన్​ పల్లి తండా గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండు మూడు రోజులుగా నిర్మాణాలు చేపడుతున్నరు. వాటికి ఎలాంటి పర్మిషన్​ లేదు.  ఇంటి పన్ను రసీదులు  ఇవ్వలేదు. అక్రమంగా నిర్మించిన ఇళ్లకు  నోటీసులు రెడీ చేసినం. త్వరలోనే వారికి సర్వ్ చేస్తం.
- హరీశ్, సెక్రటరీ, పొడ్చన్​ పల్లి తండా