- కోర్టు ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారుల చర్యలు
- మిగిలిన నిర్మాణాలపై స్థానికుల ఆగ్రహం
- సీజింగ్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు
మియాపూర్, వెలుగు: మియాపూర్‌లోని వివాదాస్పద భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన రెండు అక్రమ నిర్మాణాలను చందానగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం సీజ్‌చేశారు. శేరిలింగంపల్లి మండలంలోని మియాపూర్మక్త మహబూబ్‌పేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 44లో 260 ఎకరాల ప్రభుత్వ భూమిపై వివాదం నడుస్తుంది. ఈ భూమిపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండగా, జీహెచ్ఎంసీ నుంచి ఇంటి నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు జీహెచ్ఎంసీ చందానగర్ టౌన్ ప్లానింగ్ఏసీపీ, టీపీఎస్‌లను మేనేజ్ చేసి భారీ భవన నిర్మాణాలను చేపడుతున్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకే ఎన్ క్లేవ్, రెడ్డి కాలనీల్లోని ఈ భవనాలను కోర్టు ఆదేశాలతో అధికారులు బుధవారం సీజ్ చేశారు.
మిగిలిన అక్రమ నిర్మాణాల సంగతేంటి ?
ఇదే సర్వే నంబర్ 44లో నాగార్జున ఎన్క్లేవ్, రెడ్డికాలనీ, బీకే ఎన్క్లేవ్ కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీల్లో చేపడుతున్న భవన నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. కానీ టౌన్ప్లానింగ్అధికారుల అండదండలతో నిర్మాణదారులు ఐదు, ఆరు అంతస్తులకు మించకుండా అక్రమ భవనాలను నిర్మిస్తూ ఫ్లాట్లను అమాయక ప్రజలకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కాలనీల్లో వెలసిన మిగిలిన అక్రమ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్చేస్తున్నారు.
సీజ్ పేరిట వసూల్ దందా!
ఇటీవల జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్‌అధికారులు అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇస్తూ సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసిన వారం, పది రోజుల్లో తిరిగి సదరు సీజింగ్బిల్డింగ్లో నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజ్చేసిన టౌన్ప్లానింగ్అధికారుల చేతులు తడిపితే తిరిగి నిర్మాణం చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తునట్లు తెలుస్తుంది. ఇటీవల చందానగర్సర్కిల్హఫీజ్పేట డివిజన్గంగారం గ్రామంలో ఓ వ్యక్తి ఎలాంటి రోడ్డు లేకుండానే 800 గజాల్లో అక్రమ నిర్మాణాన్ని చేపట్టాడు. దీనికి నోటీసులు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ ఏసీపీ నాగిరెడ్డి, టీపిఎస్ రమేశ్‌తో కలిసి సీజ్ చేశారు.
సీజింగ్ చేసిన పది రోజుల్లోనే నిర్మాణదారుడు సీజింగ్బ్యానర్లు, రిబ్బన్లను తొలగించి తిరిగి నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాడు. ఇలా అక్రమ నిర్మాణాల సీజింగ్పేరుతో టౌన్ ప్లానింగ్‌అధికారులు వసూళ్ల దందాకు తెరలేపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిర్మాణాలను మొదట్లోనే అడ్డుకోవల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే నోటీసులతో సరిపెడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై ఎవరైనా కోర్టుకు వెళ్లి సీజింగ్ఆర్డర్ తెస్తే తప్ప సీజింగ్ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
