- పర్మిషన్స్, వే బిల్స్ లేకుండానే ట్రాన్స్‌పోర్ట్
- ఎల్కతుర్తి, రాంపూర్ లోని కట్టింగ్, పాలీషింగ్ ఇండస్ట్రీలకు గుట్టుగా రవాణా
- రాయల్టీ, జీఎస్టీ ఎగ్గొడుతున్న అక్రమార్కులు
- నామమాత్రపు చర్యలకే పరిమితమవుతున్న ఆఫీసర్లు
మడికొండ నుంచి ఎలాంటి వేబిల్స్, పర్మిషన్స్ లేకుండా గ్రానైట్ తరలిస్తున్న లారీ ఈ నెల 6న రాత్రి సమయంలో ఎల్కతుర్తికి చేరుకుంది. సమాచారం అందుకున్న మైనింగ్ ఆఫీసర్లు ఆ లారీని ఆపి పర్మిషన్లు చెక్ చేశారు. ట్రాన్సిట్ పర్మిట్(ఈ-వే బిల్), రాయల్టీ రశీదు, ఇతర అనుమతులు లేకపోవడంతో అధికారులు వాహనాన్ని సీజ్ చేశారు. ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తూ గ్రానైట్ బ్లాక్ లు తరలించడం ఇక్కడ సర్వసాధారణమైంది.
హనుమకొండ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తి, రాంపూర్ ప్రాంతాల్లో దాదాపు 80కు పైగా గ్రానైట్ కట్టింగ్, పాలీషింగ్ ఇండస్ట్రీలున్నాయి. వీటికి ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి గ్రానైట్ బ్లాక్ లు వస్తుండగా.. కొన్ని ఇండస్ట్రీలు క్వారీల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే గ్రానైట్ ముడిసరుకును తీసుకొస్తూ జీరో దందా సాగిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఎలాంటి ఐడెంటిఫికేషన్ నంబర్స్ లేకుండా రాత్రి సమయంలో ఇండస్ట్రీలకు తరలుతున్న గ్రానైట్ లారీలే ఇందుకు సాక్ష్యం
హనుమకొండ, ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లాలో గ్రానైట్ జీరో దందా జోరుగా సాగుతోంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వే బిల్లులు, ట్రాన్సిట్ పర్మిషన్లు లేకుండానే గ్రానైట్ బ్లాకులు జిల్లాలోని కట్టింగ్, పాలీషింగ్ ఇండస్ట్రీలకు తరలుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు గ్రానైట్ కంపెనీల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ఈ అక్రమ దందాను కొనసాగిస్తుండగా, ప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్టీ రూపంలో రావాల్సిన ఆదాయానికి భారీగా నష్టం జరుగుతోంది. కొంతమంది గ్రానైట్ వ్యాపారులు రాత్రివేళల్లోనే ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ అధికారులు అప్పుడప్పుడూ పట్టుకున్నా నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రానైట్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదని స్థానికులు అంటున్నారు.
నో ట్యాక్స్.. నో బిల్లులు..
గ్రానైట్ క్వారీల్లో రాయిని కట్ చేసిన తర్వాత దాని రకం, పరిమాణం, నాణ్యత ఆధారంగా ప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్టీ చెల్లించాలి. ఇందుకోసం క్వారీ లీజ్ అనుమతులతో పాటు రవాణా చేసే వాహనం నంబర్, గ్రానైట్ పరిమాణం, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలతో తెలంగాణ మైన్స్ అండ్ జియాలజీ శాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్ నమోదు చేసి మినరల్ ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ తీసుకోవాలి. ఈ ప్రక్రియ అనంతరం ప్రతి రవాణాకు డిస్పాచ్ పర్మిట్ జారీ అవుతుంది. ఈ పర్మిట్ ఆధారంగానే గ్రానైట్ బ్లాకులను తరలించాల్సి ఉంటుంది.
అయితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు తప్పించుకోవడానికి కొందరు వ్యాపారులు వే బిల్లులు లేకుండానే గ్రానైట్ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని క్వారీల నుంచి ముడి గ్రానైట్‌ను నేరుగా ఇండస్ట్రీలకు తరలిస్తూ అక్రమంగా వ్యాపారం కొనసాగిస్తున్నారని సమాచారం. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది.
రాత్రివేళ కళ్లు గప్పి రవాణా..
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, రాంపూర్ ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్ కట్టింగ్, పాలీషింగ్ యూనిట్లు ఈ జీరో దందాకు కేంద్రాలుగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు కంపెనీల యజమానులకు సొంత క్వారీలు ఉండటంతో ఎలాంటి కొలతలు, అనుమతులు లేకుండానే వారి సొంత వాహనాల్లో గ్రానైట్ బ్లాకులను తరలిస్తున్నారని తెలుస్తోంది. ఈ అక్రమ రవాణా ఎక్కువగా రాత్రివేళల్లో జరుగుతున్నట్లు సమాచారం. కొందరు ఒకే పర్మిషన్‌ను పలుమార్లు వినియోగించడం, కాగితాల్లో తక్కువ పరిమాణం చూపించడం, ఒక క్వారీ పర్మిట్‌ను మరో రవాణాకు ఉపయోగించడం వంటి మార్గాలతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
విలేజ్ రోడ్ల నుంచి..
చెక్‌పోస్టులను తప్పించేందుకు గ్రానైట్ లారీలు గ్రామీణ రహదారులను వినియోగిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అదేవిధంగా గ్రానైట్ లారీలకు ముందుగా వేరే వాహనాలను పంపించి రహదారులపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారో లేదో సమాచారం అందించేలా ప్రత్యేక ఎస్కార్ట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఈ అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయం భారీగా దెబ్బతింటుండగా, గ్రానైట్ అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. జిల్లాలోని ఉన్నతాధికారులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు
డిమాండ్ చేస్తున్నారు
విచారణ జరుపుతున్నం
మూడు రోజుల క్రితం ఎల్కతుర్తి వద్ద ఎలాంటి వే బిల్ లేకుండా గ్రానైట్ రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నం. వారి వద్ద అనుమతులు లేవు. వెంటనే వెహికల్ సీజ్ చేశాం. గ్రానైట్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా విచారణ జరుపుతున్నాం. దాని అధారంగా క్వారీ యజమానులపైనా చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా సాగుతున్న గ్రానైట్ దందాపై స్పెషల్ ఫోకస్ పెడతాం.
- రామాచారి, మైనింగ్ ఏడీ, హనుమకొండ జిల్లా
