ఇందూరు జైలు చుట్టూ అక్రమ మైనింగ్​

ఇందూరు జైలు చుట్టూ అక్రమ మైనింగ్​
  • ఇందూరు జైలు చుట్టూ అక్రమ మైనింగ్​
  • మాయమైన గుట్టలు, పుట్టలు, పచ్చని చెట్లు

నిజామాబాద్, వెలుగు :  అది నిజామాబాద్​ శివారులోని జిల్లా జైలు. పది నెలల క్రితం వరకు జైలు పరిసరాలు చుట్టూ గుట్టలు, పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉండేవి. కట్​చేస్తే, ఇప్పుడు ఆ ప్రాంతమంతా గోతులు, గుంతలతో దయనీయంగా మారింది. రూలింగ్ పార్టీ లీడర్లు, ఆఫీసర్లు కలిసి సహజ వనరులను ఎలా దోపిడీ చేస్తున్నారో చెప్పేందుకు నిజామాబాద్​ జైలు పరిసరాలే నిదర్శనం. మైనింగ్​మాఫియా దర్జాగా మొరం, మట్టి తోడుకెళ్తుంటే అధికారులు కండ్లప్పగించి చూస్తున్నారు. దీని వెనుక భారీ మొత్తం చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 


సహజవనరుల దోపిడీ


నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలోనే అక్రమ మైనింగ్​ మాఫియా సహజ వనరులను ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తోంది. ‘గులాబీ’ అనుచర కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు కుమ్మక్కై  ప్రభుత్వ స్థలంలో అభివృద్ధి పేరిట తవ్వుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. జిల్లా జైలులోనే అక్రమ తవ్వకాలతో రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.10  నెలలుగా రోజుకు 100 టిప్పర్ల చొప్పున మొరం తరలిస్తూ రూ. 15 కోట్లు జేబులో వేసుకున్నట్టు సమాచారం. అయితే అభివృద్ధి పనుల పేరిట ఓ ప్రైవేట్​ఏజెన్సీకి కాంట్రాక్ట్​ ఇచ్చామని, తమ తప్పేమిలేదని జైలు శాఖ అధికారులు చెబుతున్నారు.  


జైలు డెవలప్​మెంట్​ పేరిట...

సారంగాపూర్​ శివారులో ఉన్న జిల్లా జైలుకు 15 ఏండ్ల కింద ప్రభుత్వ అసైన్డ్​ భూమి 80 ఎకరాలు కేటాయించారు. 50 ఎకరాల్లో జైలు నిర్మించగా మిగిలిన స్థలంలో గుట్ట ఉంది. జైలు డెవలప్​మెంట్​లో భాగంగా గుట్టను తవ్వడానికి మూడున్నరేండ్ల కింద ఓ కాంట్రాక్ట్​ ఏజెన్సీకి జైళ్ల శాఖ బాధ్యతలు అప్పగించింది. దీని ప్రకారం గుట్టను చదును చేసి పార్కుతో పాటు కన్​స్ట్రక్షన్​కు అనువుగా చేసి ఇవ్వాలి. ఇందులో భాగంగా సదరు ఏజెన్సీ తవ్విన మొరం, మట్టిని జైళ్ల శాఖ అవసరమైన మేరకు తీసుకుంటే, మిగతాది మైనింగ్​శాఖ వే బిల్లులు ఇచ్చినవారికి అందజేయాల్సి ఉంటుంది. కానీ వే బిల్లులు ఇచ్చినా పట్టించుకోకుండా  అధికారులతో కుమ్మక్కయిన కాంట్రాక్టర్ పది నెలలుగా గుట్టను తవ్వుతూ రోజూ వందకు పైగా టిప్పర్ల మొరం, మట్టిని అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నాడు. ఇలా ఒక్కో టిప్పర్​కు రూ. 5 వేల చొప్పున రూ.5 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. ప్రతి నెల రూ. కోటిన్నర చొప్పున 10 నెలల కాలంలో రూ. 15 కోట్లు దోచుకున్నట్టు తెలుస్తోంది. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా మైనింగ్ , రెవెన్యూ శాఖలు పట్టించుకోవడం లేదు.   


దేవాదాయ శాఖ స్థలంలోనూ ..


సారంగాపూర్ శివారులో జైలు పక్కన ఉన్న దేవాదాయశాఖ స్థలంలోనూ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. 58వ సర్వేనంబర్ లో 38 ఎకరాల అసైన్డ్​ భూములున్నాయి. ఇందులో సారంగాపూర్ హనుమాన్ టెంపుల్​కు 20.30 ఎకరాలు ఇచ్చారు. దీని పక్కన ఓ ప్రైవేట్ వ్యక్తి 1.25 ఎకరాల పట్టాభూమి కొన్నారు. అందులో కొంత భాగం గుట్ట ఉండడంతో దాన్ని తవ్వడానికి పర్మిషన్​తీసుకున్నాడు. కానీ, పక్కనే ఉన్న ఏడెకరాల స్థలంలో ఉన్న గుట్టను పూర్తిగా తొలిచేస్తున్నాడు. ఏడాదిగా ప్రతిరోజూ 40 నుంచి 50 టిప్పర్ల మొరం, మట్టి తీసుకెళ్తుండడంతో గత నవంబర్​లో స్థానికులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన విచారణకు ఆదేశించగా అప్పట్లో రెండు టిప్పర్లను పది రోజుల కింద మరో రెండు ట్రాక్టర్లను రెవెన్యూ ఆఫీసర్లు సీజ్ చేశారు. అయితే అప్పుడప్పుడు మాత్రమే ఇలా తనిఖీలు చేస్తూ.. రెండు, మూడు వాహనాలను పట్టుకుని తామూ పని చేస్తున్నట్టు కలరింగ్​ ఇస్తున్నారు.