బాల్కొండ మండలంలో దర్జాగా మట్టి దందా .. వరద కెనాల్ మట్టి అక్రమ రవాణా

బాల్కొండ మండలంలో దర్జాగా మట్టి దందా .. వరద కెనాల్ మట్టి అక్రమ రవాణా
  • సెలవు దినాలు, రాత్రుల్లో జోరుగా తవ్వకాలు 
  •  మామూళ్ల మత్తులో అధికారులు

బాల్కొండ, వెలుగు : మండలంలో మట్టి దందా మూడు టిప్పర్లు..ఆరు ట్రాక్టర్లు అన్నట్టు సాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్  నుంచి మిగులు జలాలను వినియోగించుకునేందుకు చేపట్టిన వరద కాల్వ పనుల్లో మొరాన్ని తవ్వి గుట్టలుగా పోశారు. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు దర్జాగా మట్టి దందా చేస్తున్నారు.  బాల్కొండ, ముప్కాల్, మెండోరా, మోర్తాడ్ మండలాల్లోని వెంచర్లు, ఖాళీ స్థలాల్లో మట్టిని పోసేందుకు అధికారుల నుంచి అడ్డగోలు పర్మిషన్లు తెచ్చుకుని రాత్రి, పగలు అని తేడా లేకుండా జేసీబీలతో మట్టిని తరలిస్తున్నారు. మట్టి అక్రమ రవాణాను అరికట్టాల్సిన ఆఫీసర్లు మామూళ్లు తీసుకుని మౌనం వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. 

ప్రాజెక్ట్​వరద కెనాల్ నుంచి మట్టిని తరలించాలంటే ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అనుమతి అవసరం. గతంలో డీడీ ల రూపంలో రుసుము చెల్లించేవారు. ప్రస్తుతం ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్ల సమన్వయ లోపంతో ఎవరికి వారే అనుమతులు ఇస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. మట్టి అక్రమ రవాణాపై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల్కొండ మండలం వన్నెల్(బీ) గ్రామంలో ఎలాంటి అనుమతి లేకుండా మొరం దందా సాగుతోంది. స్థానిక లీడర్ల అండదండలతో మట్టి అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

సెలవు దినాలు, రాత్రుళ్లు తరలింపు

మట్టి దందా బయటికి రాకుండా రాత్రిళ్లు, సెలవు దినాల్లో టిప్పర్లు, ట్రాక్టర్ల తో మట్టిని తరలిస్తున్నారు. ఎవరికంటా పడకుండా వన్నెల్(బీ)ని కేంద్ర బిందువుగా చేసుకుంటున్నారు. వాహనాలు స్పీడ్ గా వెళ్తున్నాయని, ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని గ్రామస్తులు  మండిపడుతున్నారు. ఆఫీసర్లు స్పందించి అక్రమ రవాణాను అడ్డుకోవాలని 
కోరుతున్నారు. 

మట్టి తరలిస్తే చర్యలు

పర్మిషన్ లేకుండా ప్రాజెక్ట్​ వరద కెనాల్ నుంచి మట్టి తరలిస్తే చర్యలు తీసుకుంటాం. పర్మిషన్ లెటర్లు ఎమ్మార్వో, ఎస్సైకి ఇచ్చాకే సదరు వ్యక్తికి ఇస్తాం.  నిబంధనలు అతిక్రమిస్తే పోలీస్ సాయంతో వెహికల్స్ సీజ్ చేస్తాం.

రామారావు, ప్రాజెక్ట్​ఏఈ 

రెవెన్యూ కు సంబంధం లేదు..

మొరం తరలింపు పర్మిషన్ రెవెన్యూ శాఖకు సంబంధం లేదు. ఇరిగేషన్ శాఖ పర్మిషన్ తమకు పంపితే పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. మొరం అక్రమ తరలింపుపై  సమాచారం అందితే వాహనాలు సీజ్ చేస్తాం.‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ 

శ్రీధర్, బాల్కొండ ఎమ్మార్వో