కరీంనగర్​ శివార్లలో రెచ్చి పోతున్న రియల్టర్లు

కరీంనగర్​ శివార్లలో రెచ్చి పోతున్న రియల్టర్లు
  • జోరుగా అక్రమ వెంచర్లు
  • కరీంనగర్​ శివార్లలో రెచ్చి పోతున్న రియల్టర్లు

కరీంనగర్, వెలుగు:  పట్టణంతోపాటు కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాల్లో అక్రమ వెంచర్లు జోరుగా వెలుస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ( సుడా) పరిధిలో 72 గ్రామాలు ఉన్నాయి. ఇందులో కరీంనగర్ శివారులోని బొమ్మకల్, నగునూరు, లక్ష్మీపూర్, మల్కాపూర్ తదితర ఏరియాలతోపాటు తిమ్మాపూర్, మానకొండూరు, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి, గంగాధర ఏరియాల్లో భూములకు బాగా డిమాండ్ ఉండటంతో అక్రమ వెంచర్ల జోరు కొనసాగుతోంది. వ్యవసాయ భూములను నాలా కన్వర్షన్ చేయకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అరెకరం నుంచి మొదలుకొని ఎకరం, రెండెకరాల వరకు భూములు కొని నాలా అనుమతులు లేకుండానే అమ్ముతున్నారు. సుడా అనుమతితో తీసుకోవాలంటే మొత్తం భూమిలో 10 శాతాన్ని గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. దీంట్లో అన్ని రకాల అవసరాలకు కొంత భాగం వదలాలి. డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, రోడ్లు తదితర వసతులు కల్పంచాలి.

పట్టించుకోని ఆఫీసర్లు..  

రియల్టర్లు ఐదారు ఎకరాల స్థలం కొని అభివృద్ధి పనులు చేపట్టకుండానే  ప్లాట్లకు హద్దు రాళ్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమ వెంచర్లపై మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఫిర్యాదులు వస్తే తప్ప స్పందించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులు అందిన తరువాత వెంచర్లకు వెళ్లి హద్దురాళ్లు తొలగించడం మినహా ఆ తర్వాత చర్యలు తీసుకోకపోవడంతో రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ వ్యాపారులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

జిల్లా చుట్టుపక్కల ఇలా..  

తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్మిషన్ లేకుండా రియల్ దందా జోరుగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో సుడా, జీపీల పర్మిషన్ లేకుండానే అధికారుల కనుసన్నల్లో జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం నాలా పర్మిషన్ తో భూములు విక్రయిస్తున్నా ఇదేంటని అడిగే అధికారి లేడు. 2020లో ప్రభుత్వం భూములు రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా అప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు లేకుండానే ఎవరికి వారే భూములను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. 

మచ్చుకు కొన్ని..

ఇటీవల నుస్తులాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన వెంచర్లలో నిబంధనలు పాటించలేదు. అలాగే కరీంనగర్ రూరల్ మండలం నగునూరు బ్రిడ్జి సమీపంలో ఎకరం వరకు ఆక్రమించి వెంచర్ చేశారు. దీనికికూడా ఎలాంటి అనుమతి లేదు. బొమ్మకల్ ఏరియాలో అనుమతులు తీసుకోకుండా వ్యవసాయ భూమిని ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. కరీంనగర్ – హైదరాబాద్ జాతీయ రహదారికి సమీపంలో ఎకరం భూమిలో వెంచర్ చేశారు. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. గతంలో పంచాయతీరాజ్ అధికారులు.. హద్దు రాళ్లను తొలగించి ‘అనుమతి లేని ప్లాట్లు విక్రయించినా.. కొనుగోలు చేసినా ఇబ్బందికరం’ అని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే నిర్వాహకులు ఆ బోర్డు తొలగించి యథేచ్ఛగా ప్లాట్లు విక్రయిస్తున్నారు.