సూర్యాపేట జిల్లాలో అక్రమ వెంచర్లు..పట్టించుకోని అధికారులు

సూర్యాపేట జిల్లాలో అక్రమ వెంచర్లు..పట్టించుకోని అధికారులు

సూర్యాపేట, వెలుగు : నాలా కన్వర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజు, పంచాయతీకి 10 శాతం భూమి ఎగ్గొట్టేందుకు రియల్టర్లు కొత్త దారులు వెదుకుతున్నారు. పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా సాగు భూములను ప్లాట్లుగా మార్చడమే కాకుండా, వాటిని గుంటల లెక్కన అమ్మేస్తున్నారు. ఇదంతా ఆఫీసర్లకు తెలిసినా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే రియల్టర్లకు అధికార పార్టీ లీడర్ల అండ ఉండడం, ఆఫీసర్లకు రియల్టర్ల నుంచి అందాల్సినవి టైంకు చేతికి వస్తుండడంతోనే అక్రమ వెంచర్లను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

వెంచర్లుగా మారుతున్న పొలాలు

సూర్యాపేట జిల్లా ఏర్పడిన తర్వాత భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో కొందరు వ్యక్తులు చోట మోటా లీడర్లు, ముఖ్య నేతల అనుచరులు, ప్రజా ప్రతినిధుల అండతో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోకుండా, నాలా కన్వర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకుండానే సాగు భూములను వెంచర్లుగా మారుస్తున్నారు. సూర్యాపేట సమీపంలోని కుడకుడ, గాంధీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీబీగూడెం, పిల్లలమర్రి, చివ్వెంలతో పాటు, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో విచ్చలవిడిగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. కొందరు వ్యక్తులైతే ఏకంగా ప్రభుత్వ, ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములనే ఆక్రమించి వెంచర్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివ్వెంల మండలం ఉండ్రుగొండ పరిధిలో ఇటీవల వెలిసిన ఓ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములు సైతం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే మండలం గుంజలూరు వద్ద 45 ఎకరాలల్లో ఇటీవల వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయగా, ఇందులో సగభాగానికే పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నట్లు సమాచారం. కొందరు వ్యక్తులు సాగు భూములను వెంచర్లుగా మార్చి కుంటల రూపంలో అమ్ముతున్నట్లు రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయిస్తున్నారు. దీంతో రోడ్డు కోసం వదిలిన భూమికి రైతుబంధు డబ్బులు సైతం అందుతున్నాయి.

మామూళ్ల మత్తులో ఆఫీసర్లు

వ్యవసాయ భూములను ఎలాంటి పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా వెంచర్లుగా మారుస్తున్నారని ఆఫీసర్లకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివ్వెంల మండలం కుడకుడ సమీపంలో కొందరు అక్రమ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసి నాలా కాల్వను పూడ్చి రోడ్డు వేశారు. ఈ విషయం ఆఫీసర్లకు తెలిసినా పట్టించుకోవడం లేదని పలువరు ఆరోపిస్తున్నారు. హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిసర ప్రాంతాల్లో పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా భారీ సంఖ్యలో వెంచర్లు పుట్టుకొస్తున్నా స్థానిక నేత సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండడంతో ఆఫీసర్లు ఆ వెంచర్ల జోలికి వెళ్లడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఎలాంటి రాజకీయ పలుకుబడి లేని వారిపై హడావుడిగా చర్యలు తీసుకోవడం గమనార్హం.