ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. కూల్ డ్రింకులో పురుగుమందు కలిపి తాగించారు

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. కూల్ డ్రింకులో పురుగుమందు కలిపి తాగించారు

జగదేవపూర్, వెలుగు: మహిళతో ఓ యువకుడు కొనసాగించిన వివాహేతర సంబంధం అతని హత్యకు దారి తీసింది. మెదక్  జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన ఉపేందర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో గొడవలు జరిగాయి. ఆరు నెలల క్రితం ఉపేందర్, ఆ మహిళ కుటుంబ సభ్యుల మధ్య మరోసారి గొడవలు జరగగా నేరేడుమెట్ పోలీస్ స్టేషన్ లో ఉపేందర్ పై వివాహిత కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. దీంతో ఉపేందర్  ఆమెకు కొంతకాలం దూరంగా ఉన్నాడు. అయితే గత నెల రోజుల పాటు మళ్లీ ఉపేందర్  తన ఫోన్  నుంచి సదరు మహిళకు ఫోన్  చేయడం, మెసేజ్ పంపడం వంటివి చేశాడు. ఆ మహిళ భర్త నాగరాజు గమనించి భార్యతో గొడవపడ్డాడు. ఎలాగైనా ఉపేందర్  పీడ తొలగించుకోవాలని భావించిన నాగరాజు తన భార్యతో కలిసి అతడిని హత్య చేయడానికి ప్లాన్  వేశాడు. 

గత నెల 30న ఉపేందర్ కు ఫోన్ చేసి  హైదరాబాద్ లోని నేరెడ్ మెట్ ప్రాంతంలో తాము నివాసం ఉండే ఇంటికి పిలిపించారు. అతను ఆ ఇంటికి వెళ్లగానే సదరు మహిళ, తల్లి, భర్త ముగ్గురూ కలిసి ఉపేందర్ ను చితకబాదారు. అనంతరం పురుగుమందు కలిపిన కూల్ డ్రింకు బలవంతంగా తాగించారు. దాంతో ఇంటికి వెళ్లిన ఉపేందర్  మరుసటి రోజు అనారోగ్యం పాలయ్యాడు. వాంతులు, విరేచనాలు అవుతుండడంతో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేరాడు. పన్నెండు రోజుల పాటు చికిత్స పొందాడు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఉపేందర్  కుటుంబ సభ్యులు గురువారం అతడిని గాంధీ హాస్పిటల్  తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉపేందర్  చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు నేరేడ్ మెట్  పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఉపేందర్  ఆసుపత్రిలో ఉండగానే అతని భార్య ఫిర్యాదు చేయడంతో ఉపేందర్  వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. 

గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి

పోస్ట్ మార్టమ్ అనంతరం ఉపేందర్  మృతదేహన్ని అతని కుటుంబ సభ్యులు నాగరాజు ఇంటి వద్ద తీసుకురావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో  మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు నాగరాజు ఇంటి తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని అక్కడ పెట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్  చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో  సీఐ జానకి రాంరెడ్డి, జగదేవపూర్, ములుగు, గౌరారం, మర్కూక్ ఎస్సైల ఆధ్వర్యంలో  పోలీసులు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు నాగరాజు తల్లి, తమ్ముడు, చెల్లిని ఉదయం నుంచి గ్రామంలోని ఒక కమ్యూనిటీ భవనంలో నిర్బంధించినట్లు తెలుస్తోంది.