- 13 నుంచి 18 మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాల తిరోగమనం వేగంగా సాగుతున్నది. గురువారం నాటికి తెలంగాణ నుంచి సగం రుతుపవనాలు వెళ్లిపోయాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల నుంచి వాటి ప్రభావం పోయింది. మరో రెండు, మూడు రోజుల్లో పూర్తిగా వెళ్లిపోతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల12, 13వ తేదీల నాటికి ఈశాన్య రుతుపవనాల కాలం మొదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాటి ప్రభావంతో ఈ నెల 13 నుంచి18 మధ్య పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయన్న అంచనాలున్నాయి.
అల్పపీడనం ఏర్పడితే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో పూర్తిగా పొడి వాతావరణ పరిస్థితులే ఉన్నాయి. రాబోయే రెండు వారాల పాటు సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు ఎక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల కన్నా ఎక్కువ నమోదవుతున్నాయి.
