
- వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
- భూపాలపల్లి జిల్లాలో గోడ కూలి మహిళ మృతి
- హైదరాబాద్‌లో కుండపోత.. భారీగా ట్రాఫిక్ జామ్
- ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
- ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్
- మరో రెండ్రోజులు వర్షాలు
- రెండు జిల్లాలకు రెడ్, 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్/నెట్‌వర్క్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచే పలు జిల్లాల్లో కుండపోత వానలు పడ్తున్నాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో 12.9, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 11.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణ పేట జిల్లాల్లోని పలుచోట్ల 7 సెం.మీ.ల వర్షపాతం రికార్డయింది. భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నక్కవాగు ఉధృతంగా ప్రవహించడంతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి, ఇంద్రేశం ప్రాంతాల్లో నేషనల్హైవే 65పై పెద్ద ఎత్తున వరద చేరింది. దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది.
సంగారెడ్డి టౌన్‌లోని లోతట్టు కాలనీలు నీట మునగడంతో ఇండ్లలోని నిత్యావసర వస్తువులు, ఫర్నిచర్ తడిసిపోయాయి. మెదక్‌లో గుండు వాగు ఉధృతంగా ప్రవహించడంతో హవేలీ ఘనపూర్ మండలం దూప్‌సింగ్ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో బోయలగూడెం, లింగాపురం మధ్య వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం బెగ్లూరులో ఇంటి గోడ కూలడంతో మంద లక్ష్మి (58) అనే మహిళ మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆమె భర్త దుర్గయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
గోదావరి ఉగ్రరూపం..
ఎగువన కురుస్తున్న వానలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ బ్యారేజీకు వరద పోటెత్తడంతో 85 గేట్లు ఎత్తి కిందికి వదులుతున్నారు. తాడిచర్ల ఓసీ, భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 2,3 ఓసీల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు. ములుగు జిల్లాలో గోదావరి మట్టం 14.820 మీటర్లు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏటూరునాగారం మండలంలోని దొడ్ల వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాజేడు మండలం టేకుల గూడం వద్ద రేగుమాగు వాగు ఉప్పొంగడంతో తెలంగాణ, చత్తీస్‌గఢ్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది.
శుక్రవారం మధ్యాహ్నం12 గంటల సమయంలో నీటిమట్టం 43 అడుగులకు పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో నీటిమట్టం 44.70 అడుగులకు చేరగా 10 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తోంది. గరిష్టంగా 47 అడుగులకు వరద వచ్చి తర్వాత తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, చెరువులు మత్తడి దుంకడం, వాగులు ఉప్పొంగడంతో వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో పలుచోట్ల వరి, పత్తి పంటలు నీటమునిగాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్పూర్, కొత్తగట్టు గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది.
కోఠి ఈఎన్టీలోకి నీళ్లు..
హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి నుంచే వర్షం దంచికొడ్తున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. జనరల్, ఎమర్జెన్సీ వార్డుల్లోకి వరద చేరడంతో పేషెంట్లు, డాక్టర్లు ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షానికి ఐటీ కారిడార్‌తో పాటు రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్స్తంభించింది.
రాయదుర్గం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపోయాయి. పోలీసుల సూచన మేరకు పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. మూసీకి వరద ఉధృతి పెరగడంతో మూసారంబాగ్ బ్రిడ్జిని క్లోజ్ చేశారు. జంట జలాశయాల్లోకి భారీగా వరద రావడంతో గేట్లెత్తారు. ప్రస్తుతం రెండు జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో 8 వేల క్యూసెక్కులు ఉంది.
ఉస్మాన్‌సాగర్13 గేట్లను ఎత్తగా, హిమాయత్‌సాగర్9 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. రెండింటిని నుంచి 21,439 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వాటర్‌బోర్డు సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్టు వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలందరినీ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటి వరకు వెయ్యి మందిని షెల్టర్ హోమ్స్‌కు తరలించారు. కాగా, భారీ వర్షాల కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలను దారిమళ్లించారు. ముంబై, కోల్‌కతా, పుణె- నుంచి వచ్చి ఫ్లైట్లను విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించినట్టు అధికారులు తెలిపారు.
మరో రెండ్రోజులు వానలు..
రాష్ట్రంలో శని, ఆదివారాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్అలర్ట్ జారీ చేసింది. ఆదివారం కూడా 17 జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.