బంగాళాఖాతంలో బలపడుతున్న అల్ప పీడనం : తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్ప పీడనం : తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

చల్లటి గాలులు.. చలితో గజగజ వణికిపోతున్న రోజుల్లో.. వాయుగుండం ముప్పు వణికిస్తుంది. బంగాళాఖాతంలో మలక్కా జల సంధి, దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్నట్లు ప్రకటించింది భాతర వాతావరణ శాఖ. బలపడుతున్న అల్పపీడనం.. 48 గంటల్లో వాయుగుండంగా మారనున్నట్లు స్పష్టం చేసింది. అంటే.. 2025, నవంబర్ 26వ తేదీ నాటికి ఇది వాయుగుండంగా మారనుంది.

బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండంతో దేశంలో చాలా చోట్ల వర్షాలు పడనున్నట్లు అలర్ట్ ఇచ్చిన వెదర్ డిపార్ట్ మెంట్. ముఖ్యంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాబోయే 48 గంటల్లో.. అంటే నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. 

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, చెంగల్ పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, మైలాడుతురై, శివగంగ, తెన్ కాశి, కన్యాకుమారి, తేని, విరుదునగర్, నాగపట్నం, పుదుచ్చేరి, ధర్మపురి, రామనాథపురం, కృష్ణగిరి, సల్లం, తిరుపత్తూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 

ఇక కేరళ రాష్ట్రం విషయానికి వస్తే.. కొల్లాం, కొట్టాయం, ఎర్నాకుళం, తిరువనంతపురం, అలప్పుజా, ఇడుక్కి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు హెచ్చరిస్తూ.. ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది వెదర్ డిపార్ట్ మెంట్. వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు అధికారులు. 

ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ప్రస్తుతానికి వాతావరణం పొడిగా.. చల్లగా ఉంటుందని.. 48 గంటల తర్వాతనే స్పష్టత వస్తుందని వివరించింది వాతావరణ శాఖ.

బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం తుఫాన్ గా మారే సూచనలు ఉన్నాయని.. ఇప్పటికే దీనికి సెన్యార్ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు అధికారులు. ఈ తుఫాన్ కదలికలపై మరో 48 గంటల్లో స్పష్టత వస్తుందని వివరిస్తూ.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని తమిళనాడు, కేరళ రాష్ట్రాల మత్స్యకారులకు సూచించారు వాతావరణ శాఖ అధికారులు. గాలులు 45  నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయని.. తీర ప్రాంత జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ.