
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి వర్షాలు కురుస్తాయంది.
శనివారం రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగపల్లి గ్రామంలో 10.5 సె.మీ, సంగారెడ్డి జిల్లా మనూర్‌లో 9.2 సె.మీ, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడిపల్లిలో 9.1 సె.మీ, మెదక్ జిల్లా రేగోడెలో 6.4 సె.మీ, అసిఫాబాద్‌లో 6.1 సె.మీ. వర్షపాతం నమోదైంది.
పలు గ్రామాలకు రాకపోకలు బంద్
సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కొండాపూర్ మండలం తొగర్‌పల్లి గ్రామంలోని ఇండ్లు నీటమునిగాయి. అధికారులు16 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పటాన్‌చెరు మండలం ముత్తంగి, ఇంద్రేశం సర్వీస్ రోడ్డుపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు వర్షం పడింది. దుమ్ముగూడెం, టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి, అశ్వాపురం, చర్ల మండలాల్లోని పలు ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు ఉధృతంగా పారుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
దుమ్ముగూడెంలో 8.7 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 276.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అత్యధికంగా కామేపల్లి మండలంలో 50.2, కారేపల్లిలో 38.2 మిల్లీమీటర్లు, కల్లూరులో 30.2 మిల్లీమీటర్ల వాన పడింది. సిద్దిపేట జిల్లా చేర్యాలలో శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి పెద్దచెరువు మత్తడి పారడంతో పట్టణంలోని శుభోదయనగర్, యాదవ నగర్, పోషమ్మవాడ, గాంధీ సెంటర్ లు జలమయమయ్యాయి.