హైదరాబాద్ వాసులకు IMD బిగ్ అలర్ట్.. రానున్న మూడు రోజుల పాటు సిటీలో భారీ వర్షాలు..!

హైదరాబాద్ వాసులకు IMD బిగ్ అలర్ట్.. రానున్న మూడు రోజుల పాటు సిటీలో భారీ వర్షాలు..!

హైదరాబాద్ వాసులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బిగ్ అలర్ట్ ఇచ్చింది. రాబోయే మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్‎కు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమే ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా మే 23 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది.

వాతావరణ ఔత్సాహికుడు టి. బాలాజీ కూడా ఇదే అంచనా వేశారు. హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో రాబోయే మూడు రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల 100 మి.మీ వరకు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మంగళవారం (మే 20) నుంచి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్‎తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేసింది. వరద నీరు నిల్వ ఉండే ప్రాంతాలను  గుర్తించి తగిన చర్యల తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.