అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిసిన గంటల వ్యవధిలోనే సునేత్రా పవార్‎తో NCP కీలక నేతలు భేటీ

అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిసిన గంటల వ్యవధిలోనే సునేత్రా పవార్‎తో NCP కీలక నేతలు భేటీ

ముంబై: ఎన్సీపీ చీఫ్​, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న విమానం బుధవారం (జనవరి 28) బారామతి ఎయిర్ స్ట్రిప్‎లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గురువారం (జనవరి 29) బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు ముగిసిన గంటల వ్యవధిలోనే అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్‎తో ఎన్సీపీ కీలక నేతలు భేటీ అయ్యారు. బారామతిలో జరిగిన ఈ సమావేశంలో ఎన్సీపీ సీనియర్ నాయకులు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, ధనంజయ్ ముండే పాల్గొన్నారు. 

అజిత్ పవార్ అకాల మరణంతో ఎన్సీపీ నాయకత్వంపై అనిశ్చితి నెలకొంది. దీంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ భేటీ జరిగినట్లు తెలిసింది. అజిత్ పవార్ హఠాన్మరణంతో బారామతి నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేయాలని.. అలాగే ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని సునేత్రా పవార్‎ను కోరినట్లు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమని ఛగన్ భుజ్‌బల్ మీడియాకు తెలిపారు. ఈ భేటీలో ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఎన్సీపీ నాయకత్వ పగ్గాలు ఎవరూ చేపడతారనే చర్చ జోరుగా సాగుతుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

►ALSO READ | నాగాలాండ్ నుంచి మణిపూర్ వైపు దూసుకెళ్లిన కార్చిచ్చు.. జుకో లోయలో 48 గంటలుగా ఆగని మంటలు 

కాగా, ప్రస్తుతం రాజ్య సభ సభ్యురాలిగా ఉన్న అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్‎ను బారామతి ఉప ఎన్నికలో బరిలోకి దించాలని ఎన్సీపీ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, అజిత్ పవార్ స్థానంలో సునేత్రా పవార్‎ను ఉప ముఖ్యమంత్రిగా ప్రతిపాదించాలని ఎన్సీపీ డిసైడ్ అయినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఎన్‌సీపీ సీనియర్ నాయకుడు, మంత్రి నరహరి జిర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‎ను రాష్ట్ర కేబినెట్‎లోకి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.