ఆర్టీసీలో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి

ఆర్టీసీలో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి
  • ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనూ కల్పించాలి
  • డెవలప్ మెంట్ సొసైటీ ఫర్ డెఫ్ డిమాండ్
  • ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు వినతి పత్రం అందజేత

ముషీరాబాద్, వెలుగు : టీఎస్ఆర్టీసీలో ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాలు, పబ్లిక్ స్థలాలు, పార్కింగ్ దుకాణ సముదాయంలో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో వికలాంగులు నష్టపోతున్నారని డెవలప్ మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. దివ్యాంగుల చట్టం --– 2016  ప్రకారం ఆర్టీసీలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్సు భవన్ వద్ద ధర్నా చేశారు.  

అనంతరం  సైగలతో నిరసన తెలిపారు. సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు వల్లభనేని ప్రసాద్, వి. భారతి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్​ గౌడ్, మహమ్మద్ మున్నా బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను కలిసి వినతి పత్రం అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆర్టీసీ పరిధిలో వేలాది షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నా  ఏ ఒక్క దివ్యాంగుడికి ఉద్యోగంతో పాటు సముదాయాలు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. 

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి రాయితీతో బస్సు పాసులు ఇవ్వాలని కోరారు. తమ సమస్యలపై  ఆర్టీసీ ఎండీకి వివరించామని, అందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు.