‘చెక్‌ పవర్‌’ను అమలు చేయండి

‘చెక్‌ పవర్‌’ను అమలు చేయండి

సర్పంచ్, ఉప సర్పంచ్‌ చెక్‌ పవర్‌ ఆదేశాలను అన్ని గ్రామ పంచాయతీల్లో అమలు చేయాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. మొక్కలను బాగా పెంచిన పంచాయతీలకు నిధుల విడుదలలో, పనుల మంజూరులో ప్రత్యేక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హరితహారం విజయవంతం చేయడానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. నాటిన మొక్కల సంరక్షణకు సర్పంచ్‌లు, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలన్నారు. ప్రభుత్వానికి సంబంధించి లేదా దాతల  స్థలం ఉంటే పంచాయతీలకు బిల్డింగులను మంజూరు చేస్తామన్నారు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ నిధులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1,406 కోట్ల ఉపాధి హామీ పనులు పూర్తయినట్లు తెలిపారు.