హైదరాబాద్, వెలుగు: 317 జీవో బాధితులైన టీచర్లు, ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన మధ్యంతర జీవో 190ని వెంటనే అమలు చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ జీవోను అమలు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేస్తోందన్నారు.
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ ప్రభుత్వానికి గుండె ధైర్యం లేని పరిస్థితి కనిపిస్తున్నదన్నారు. ఉద్యమకారులు, ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. 317 జీవో బాధితులైన టీచర్లు, ఉద్యోగులకు స్థానికత ఆధారంగా బదిలీలు చేస్తామని చెప్పి.. దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో కూడిన కేబినెట్ సబ్ కమిటీ వేశారని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇచ్చిన 190 జీవో ను ఎందుకు అమలు చేయటం లేదని కవిత ప్రశ్నించారు.
తొమ్మిది నెలలు గడిచినా దానిని అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఎవరి కోసం, ఏ పైరవీ కోసం ఈ జీవోను అమలు చేయటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కారణంగా టీచర్లు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. అవసరమైతే టీచర్ల కోసం సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలన్నారు. టీచర్లు, ఉద్యోగుల హక్కుల కోసం వారి తరఫున తెలంగాణ రక్షణ సేన ద్వారా పోరాటం చేస్తామన్నారు.
