టీచర్ల కోసం యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అమలు చేయండి: ఎమ్మెల్సీ కొమరయ్య

టీచర్ల కోసం యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అమలు చేయండి: ఎమ్మెల్సీ కొమరయ్య

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని పంచాయతీ రాజ్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల కోసం ఏకీకృత సేవా నిబంధనలు(యూనిఫైడ్ సర్వీస్ రూల్స్) తీసుకురావాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సమస్యలు, విద్యా శాఖ సంబంధిత అంశాలపై పలు విజ్ఞప్తులు చేశారు.

కేజీబీవీ, ఎస్‌ఎస్‌ఏలోని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రెగ్యులరైజేషన్ వరకు కనీసం టైం స్కేల్ అమలు చేయాలని, డీఎస్సీ-–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) వర్తింపజేయాలని కోరారు. కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ, జాతీయ విద్యా విధానం-2020 అమలులో తెలంగాణకు అనుకూల విధానాలు రూపొందించాలని సూచించారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్ పోస్టుల మంజూరు, డీఎడ్ లేని బీఎడ్ అర్హత గల ఉపాధ్యాయులకు హెచ్‌ఎం పోస్టులకు అర్హత కల్పించేందుకు ఎన్‌సీటీఈ మార్గదర్శకాలను సవరించాలన్నారు.