రెండు గ్యారంటీల అమలు ఇయ్యాల్టి నుంచే

రెండు గ్యారంటీల అమలు ఇయ్యాల్టి నుంచే
  •     200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్​కు 54.70 లక్షల మంది గుర్తింపు
  •     రూ.500 గ్యాస్​కు 40 లక్షల మంది అర్హులు
  •     ప్రారంభించనున్న సీఎం, డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌‌, వెలుగు: రూ.500కు గ్యాస్​, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్​ పథకాలు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. చేవెళ్లలో సభ ఏర్పాటు చేసి, అక్కడ ఈ స్కీమ్​లను ప్రారంభించాలని ముందుగా  నిర్ణయించినప్పటికీ మహబూబ్​నగర్​ లోకల్​ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ నేపథ్యంలో సెక్రటేరియెట్​కు కార్యక్రమాన్ని షిఫ్ట్​ చేశారు. మంగళవారం మధ్యాహ్నం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్‌‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి  ఈ స్కీమ్​లను ప్రారంభిస్తారు. 

ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా.. గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్​) స్కీమ్ కింద 54.70 లక్షల మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరిలో సదరన్‌‌ డిస్కమ్ పరిధిలో 35 లక్షల మంది, నార్తర్న్‌‌ డిస్కమ్ పరిధిలో 19.70 లక్షల మంది ఉన్నారు. ఇక, మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించనుంది. ఈ స్కీమ్ కింద 40 లక్షల మంది అర్హులను గుర్తించింది. 

మొత్తం సిలిండర్ ధర ముందే చెల్లించాల్సి ఉంటుంది. అందులో రూ.500 సిలిండర్​కు పోను మిగిలిన అమౌంట్  లబ్ధిదారు ఖాతాలో జమ అవుతుంది. రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు 11.58 లక్షల మంది ఉన్నారు. వీరంతా మహాలక్ష్మి స్కీమ్ పరిధిలోకి రానున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కంపెనీలకు ముందస్తుగా రూ.80 కోట్లు చెల్లించింది. ఈ స్కీమ్​లకు ఇంకా అర్హులను గుర్తించేందుకు ప్రజాపాలన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, అందులో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.