ఎంపీ సీట్లపై బీజేపీ నజర్..ఇన్‌‌చార్జ్‌‌ లుగా కేంద్రమంత్రులు

ఎంపీ సీట్లపై బీజేపీ నజర్..ఇన్‌‌చార్జ్‌‌ లుగా కేంద్రమంత్రులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ నియోజకవర్గాలను క్లస్టర్లుగా విభజించింది. వాటికి కేంద్ర మంత్రులు ఇన్‌‌చార్జ్‌‌లుగా ఉండనున్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశంలో సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనా రెడ్డి, ధర్మపురి అర్వింద్, పొంగులేటి సుధాకర్‌‌‌‌రెడ్డి, గరికపాటి మోహన్ రావు, మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్​తోపాటు వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్‌‌చార్జ్‌‌లు పాల్గొన్నారు. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను స్టేట్ ఆఫీసు బేరర్లకు వివరించారు. పార్లమెంట్ ప్రవాసీ యోజన కింద తెలంగాణలోని ఎంపీ స్థానాల్లో పార్టీ బలోపేతంపై చర్చించారు. 10 మంది కేంద్ర మంత్రులు ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. మన రాష్ట్రం నుంచి ప్రతి అసెంబ్లీ స్థానానికి, ప్రతి పార్లమెంట్‌‌ సీటుకు మరో ఇన్‌‌చార్జ్ ఉంటారు. ఇన్‌‌చార్జ్‌‌లుగా ఉన్న కేంద్ర మంత్రులను, నియోజకవర్గ నేతలను వీరు ఎప్పటికప్పుడు కో ఆర్డినేట్ చేయనున్నారు.

క్లస్టర్ల ఇన్‌‌చార్జులు వీరే

రాష్ట్రంలోని 17  ఎంపీ స్థానాలకు గాను 14 నియోజకవర్గాల్లో పార్లమెంట్ ప్రవాసీ కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. వీటికి కేంద్ర మంత్రులు ఇన్‌‌చార్జ్‌‌లుగా ఉండనున్నారు. సికింద్రాబాద్,  కరీంనగర్, నిజామాబాద్ స్థానాలను మినహాయించింది. ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలను ఒక క్లస్టర్‌‌‌‌గా ఏర్పాటు చేయగా.. దీనికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ఇన్‌‌చార్జ్‌‌గా ఉంటారు. హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి సీట్లను మరో క్లస్టర్‌‌‌‌గా ఏర్పాటు చేయగా.. దీనికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇన్‌‌చార్జ్‌‌గా ఉంటారు. మహబూబ్‌‌నగర్, నాగర్ కర్నూల్, నల్గొండను మరో క్లస్టర్‌‌‌‌గా విభజించగా కేంద్ర మంత్రి మహేంద్రనాథ్​ పాండేను ఇన్‌‌చార్జ్‌‌గా ఉంటారు. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలను మరో క్లస్టర్‌‌‌‌గా విభజించగా కేంద్ర మంత్రి బీఎల్ వర్మను ఇన్‌‌చార్జ్‌‌గా వ్యవహరిస్తారు. వీటితోపాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక కేంద్ర మంత్రి ఇన్‌‌చార్జ్‌‌గా ఉండనున్నారు. హైదరాబాద్‌‌కు జ్యోతిరాదిత్య సింథియా, జహీరాబాద్‌‌కు నిర్మలా సీతారామన్, మెదక్‌‌కు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, భువనగిరికి దేవీసింగ్ చౌహాన్, నల్గొండకు కైలాస్ చౌదరి, వరంగల్‌‌కు ఇంద్రజిత్ సింగ్, ఆదిలాబాద్, పెద్దపల్లికి పురుషోత్తం రూపాల, చేవెళ్ల, మల్కాజ్ గిరికి ప్రహ్లాద్ జోషి, మహబూబ్‌‌నగర్, నాగర్ కర్నూల్‌‌కు మహేంద్రనాథ్ పాండే, మహబూబాబాద్, ఖమ్మం సీట్లకు బీఎల్ వర్మ ఇన్‌‌చార్జ్‌‌లుగా ఉంటారు. 

త్వరలో బైక్ ర్యాలీలు: ప్రేమేందర్ రెడ్డి

ప్రభుత్వ విధానాలకు నిరసనగా త్వరలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టాలని ఆఫీసు బేరర్ల సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి చెప్పారు. ఈ బైక్ ర్యాలీల్లో బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నట్లు చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రేమేందర్ రెడ్డి కన్వీనర్‌‌‌‌గా మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఉమారాణి, జయశ్రీ, రామకృష్ణ కో కన్వీనర్లుగా ఉండనున్నారు.

పలువురు సీనియర్ల గైర్హాజరు

ఆఫీసు బేరర్ల సమావేశానికి పలువురు సీనియర్ నేతలు హాజరుకాలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, సీనియర్ నేతలు డీకే అరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, మురళీధర్ రావు రాకపోవడంతో పార్టీ నేతలు చర్చించుకోవడం కనిపించింది.

సంజయ్‌‌ని కలిసిన రచనారెడ్డి

హైకోర్టు అడ్వకేట్, గతంలో టీజేఎస్‌‌లో పని చేసిన రచనా రెడ్డి మంగళవారం సాయంత్రం బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్‌‌ని కలిశారు. త్వరలో బీజేపీలో చేరేందుకే ఆమె కలిసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాళేశ్వరం, మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు రైతుల తరఫున హైకోర్టులో రచనారెడ్డి కేసులు వేశారు. రచనా రెడ్డి వేసిన కేసులపై గతంలో పలు సందర్భాల్లో స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారు.

బీజేపీ స్టేట్ చీఫ్‌‌లతో ఇయ్యాల నడ్డా కాన్ఫరెన్స్

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపుపై అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు దిశా నిర్దేశం చేసేందుకు బుధవారం పార్టీ చీఫ్ జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నారు. ఈ ప్రోగ్రామ్ ఉండడం వల్లే సంజయ్ తన ఢిల్లీ టూర్ రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈనెల 8 నుంచి పర్యటనలు

వచ్చే ఎన్నికల దాకా క్లస్టర్ ఇన్‌‌చార్జ్‌‌లుగా కేంద్రమంత్రులు కొనసాగనున్నారు. క్లస్టర్ల పరిధిలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో నెలకు ఒకటీ రెండు సార్లు వీరు పర్యటించి రెండు, మూడు రోజులపాటు అక్కడే బస చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ఈ నెల 8 నుంచి కేంద్ర మంత్రులు పర్యటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్‌‌కు జ్యోతిరాదిత్య సింథియా ఈ నెల 8న వచ్చి మూడు రోజులపాటు పర్యటించనున్నట్లు నేతలు పేర్కొంటున్నారు. త్వరలో జహీరాబాద్‌‌లో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కూడా పర్యటించనున్నారని, మిగతా మంత్రుల టూర్లు ఖరారవుతాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.