ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈవీల బ్యాటరీలు పేలవు

ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈవీల బ్యాటరీలు పేలవు

ఇప్పుడంతా ఈవీ (ఎలక్ట్రానిక్‌‌ వెహికల్స్‌‌)ల ట్రెండ్‌‌ నడుస్తోంది.‌‌ పెట్రోల్‌‌ రేట్లు పెరుగుతు న్నాయని కొందరు, కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడాలని ఇంకొందరు ఈవీలకు మారుతున్నారు. ధరలు కాస్త ఎక్కువ ఉన్నా, ఛార్జింగ్‌‌ పాయింట్లు సరిపడా లేకపోయినా ఫ్యూచర్ మాత్రం ఈ – స్కూటర్లదే అని వాటిని కొనడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే, కొనడానికి ఇంట్రెస్ట్‌‌ చూపించేవాళ్లు ఎంతమంది ఉన్నారో, భయపడే వాళ్లూ అంతే ఉన్నారు. దానికి కారణం.. బ్యాటరీలు పేలి ప్రమాదాలు జరగడమే. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీ లైఫ్‌‌ పెంచుకోవడంతో పాటు, అవి పేలకుండా చూడొచ్చని సలహాలు ఇస్తున్నారు నిపుణులు.

  • చాలా మంది డ్రైవింగ్ అయిపోయి ఇంటికి రాగానే స్కూటీలకు ఛార్జింగ్‌‌ పెడుతుంటారు. అది కూడా బ్యాటరీలు పేలడానికి ఒక కారణమే. ఎందుకంటే.. రైడ్‌‌ చేసినప్పుడు బ్యాటరీ టెంపరేచర్‌‌‌‌ పెరుగుతుంది. ఆ టైంలో ఛార్జింగ్ పెడితే పేలే ప్రమాదం ఉంది. అందుకే, బ్యాటరీ టెంపరేచర్‌‌‌‌ తగ్గిన తర్వాత ఛార్జింగ్ పెట్టాలి. ఎండాకాలంలో బయట వాతావరణం వేడిగా ఉంటుంది. అందుకే, డే టైంలో కాకుండా నైట్‌‌ టైంలో బ్యాటరీ ఛార్జింగ్‌‌ పెట్టాలి.
  • కొన్ని రోజులు వాడాక ఛార్జర్లు, బ్యాటరీల లైఫ్‌‌ తగ్గుతుంది. అప్పుడు కొంతమంది స్కూటర్ కంపెనీవి కాకుండా తక్కువ ధరలో దొరుకుతుందని వేరే కంపెనీ బ్యాటరీ, ఛార్జర్లు వాడుతుంటారు. దానివల్ల మెకానిజం దెబ్బతిని ఓవర్‌‌‌‌ హీట్ అవడం, కొన్నిసార్లు పేలడం జరుగుతుంది. అందుకే ఆథరైజ్డ్‌‌ కంపెనీ ప్రొడక్ట్స్‌‌ మాత్రమే వాడాలి.
  • ఒక్కో స్కూటర్‌‌కు‌‌ ఒక్కో ఛార్జింగ్‌‌ కెపాసిటీ ఉంటుంది. అంతేగానీ అన్ని రకాల స్కూటర్‌‌‌‌ మోడల్స్‌‌ ఫాస్ట్‌‌ ఛార్జింగ్‌‌ని సపోర్ట్‌‌ చేయవు. వాళ్ల స్కూటర్ ఫాస్ట్‌‌ ఛార్జింగ్‌‌కు సపోర్ట్‌‌ చేయకపోయినా, వేరే స్కూటర్‌‌‌‌ ఫాస్ట్‌‌ ఛార్జర్‌‌‌‌తో ఛార్జింగ్‌‌ చేస్తుంటారు కొందరు. అప్పుడు బ్యాటరీకి తక్కువ టైంలో ఎక్కువ కరెంట్ పాస్‌‌ అయి, ఓవర్‌‌‌‌ హీట్‌‌ అవడం, బ్యాటరీ లైఫ్ తగ్గడం లేదా పేలిపోవడం జరుగుతుంది. అందుకే, సపోర్ట్‌‌ చేసే ఛార్జర్‌‌‌‌నే వాడాలి.
  • మాటిమాటికీ ఛార్జింగ్ పెట్టడం, తక్కువ బ్యాటరీ పర్సంటేజ్‌‌ఉన్నప్పుడే ఛార్జింగ్‌‌ తీసేయడం, లో– బ్యాటరీలో నడపడం, బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయినా తీయకుండా అలానే పెట్టి ఉంచడం వల్ల బ్యాటరీ లైఫ్ తొందరగా తగ్గుతుంది. లో– ఓల్టేజ్‌‌ కరెంట్ ఉన్నప్పుడు కూడా ఛార్జింగ్‌‌ పెట్టకూడదు.
  • స్కూటర్ నడిపేటప్పుడు ఒకేసారి లో స్పీడ్ నుంచి హై స్పీడ్‌‌కి, హై స్పీడ్‌‌ నుంచి లో స్పీడ్‌‌కి రావొద్దు. ఇలా చేస్తే బ్రేక్స్‌‌ ఫెయిల్‌‌ అయ్యే అవకాశం ఉంది. బ్యాటరీ టెంపరేచర్‌‌‌‌లో తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది.
  • స్కూటర్లను ఎక్కువ సేపు ఎండలో ఉంచితే బ్యాటరీ టెంపరేచర్‌‌‌‌ పెరుగుతుంది. వానలో తడిచిన వాటి ఛార్జింగ్ పోర్ట్‌‌ని తుడిచి, డ్రై అయ్యాకే ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్‌‌ పోర్ట్‌‌లో నీళ్లు ఉంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.