హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా ఈ ఫెస్టివల్‌ను శుక్రవారం ఉదయం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హాట్ ఎయిర్ బెలూన్‌లో సుమారు గంటన్నర సేపు 13 కిలోమీటర్లు పయనించారు.
గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమైన హాట్ఎయిర్ బెలూన్.. అప్పోజిగూడ శివారులో దిగింది. 18 అంతర్జాతీయ స్థాయి హాట్ ఎయిర్ బెలూన్‌లను ఎగురవేశారు. వీటిని నడపడానికి విదేశాల నుంచి ప్రత్యేక పైలట్లు వచ్చారు. ఇందుకు సంబంధించి బుక్ మై షోలో టికెట్లు విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే అమ్ముడుపోయాయి.
తొలుత 330 టికెట్లను విడుదల చేయగా.. అవి వెంటనే బుక్ అయిపోయాయి. ప్రజల నుంచి వచ్చిన భారీ స్పందన చూసి, తర్వాత మరో 100 టికెట్లను అదనంగా రిలీజ్ చేశారు. మొత్తం సుమారు 430 మంది ఈ టికెట్లను బుక్ చేసుకున్నారని సమాచారం. టికెట్లు బుక్ చేసుకున్నవారు బెలూన్‌లో విహరిస్తూ నగర అందాలను వీక్షించవచ్చు. ఈ నెల 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ షో
కొనసాగనున్నది.
వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదిక: మంత్రి జూపల్లి కృష్ణారావు
ఒకవైపు ‘ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్’తో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, ఆతిథ్యాన్ని చాటుతుండగా.. మరోవైపు హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ఫెస్టివల్ ద్వారా ఆధునిక సాంకేతికతను, భవిష్యత్తు దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పర్యాటక రంగంలో ఇదొక కొత్త అధ్యాయమని, వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదిక అని చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
‘డెస్టినేషన్ తెలంగాణ’ అనే బ్రాండ్‌ను బలోపేతం చేస్తూ కేవలం దేశీయ పర్యాటకులనే కాకుండా ఇంటర్నేషనల్ టూరిస్టులను కూడా ఆకర్షించేలా ఇలాంటి సాహసోపేత క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. నేడు ఆకాశంలో ఎగురుతున్న ఈ బెలూన్లు.. తెలంగాణ పర్యాటక రంగం ప్రపంచస్థాయికి చేరుకోబోతుంది అనడానికి నిదర్శనమని జూపల్లి పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఇంత భారీ స్థాయిలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించడం ఇదే తొలిసారి అని టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచాలన్న లక్ష్యంతో టూరిజం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నామని చెప్పారు.
పరేడ్ గ్రౌండ్స్‌లో కనువిందు
గ్రేటర్ హైదరాబాద్ గగనతలం రంగులమయమైంది. పరేడ్ మైదానంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘హాట్ ఎయిర్ బెలూన్’ ప్రదర్శన నగరవాసులను మంత్రముగ్దులను చేసింది. శుక్రవారం సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం ఎండీ క్రాంతి వేడుకలను ప్రారంభించారు.
గాలిలో తేలియాడే రంగు రంగుల బెలూన్లకు ఆయన పచ్చజెండా ఊపి.. నింగిలోకి పంపారు. ఇది హైదరాబాద్‌లో తొలి హాట్ ఎయిర్ బెలూన్ ఈవెంట్‌గా రికార్డు సృష్టించింది. మరో రెండురోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఆకాశంలో విహరిస్తున్న బెలూన్లను తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు.
