ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌పై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసిమ్ మునీర్ ఇండియాతో యుద్ధం కోరుకుంటున్నాడని.. అతడొక రాడికలైజ్డ్ ఇస్లామిస్ట్ అని ఆమె అభివర్ణించారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2025, మే నెలలో ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి గల కారణాలపై అలీమా ఖాన్ ఒక ప్రశ్న ఎదురైంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ఒక రాడికలైజ్డ్ ఇస్లామిస్ట్. ఇస్లామిక్ సంప్రదాయవాది. అందుకే అతను భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం కోసం ఆరాటపడుతున్నాడు. అతని ఇస్లామిక్ రాడికలైజేషన్, సంప్రదాయవాదం ఇస్లాంను నమ్మని వారిపై పోరాడవలసి వస్తుంది’’ అని పేర్కొన్నారు. తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఉదారవాది అని పేర్కొన్నారు.
ఇమ్రాన్ అధికారంలో ఉన్నప్పుడు పొరుగు దేశం ఇండియాతో స్నేహపూర్వకంగా మెలిగారని చెప్పారు. కానీ అసిమ్ మునీర్ ఇండియతో ఎప్పుడు యుద్ధం కోరుకుంటాడని ఆరోపించారు. అక్రమ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని పాశ్చాత్య దేశాలను అలీమా కోరారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌కు విలువైన ఆస్తి అని అన్నారు.
