ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ జైలులో ఆరోగ్యంగానే ఉన్నాడని ఆయన సోదరి ఉజ్మాఖాన్ చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ కోసం ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి, ఇమ్రాన్‌తో ఆయన సోదరి భేటీకి అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే ఉజ్మా ఖాన్ మంగళవారం మధ్యాహ్నం జైల్‌లోకి ప్రవేశించి ఇమ్రాన్‌ను కలిశారు. దీంతో ఇమ్రాన్ బతికే ఉన్నట్లు కన్ఫామ్ అయింది. ఉజ్మా ఖాన్ జైల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
"ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారు. ప్రభుత్వం ఇమ్రాన్‌ను ఏకాంత నిర్బంధంలో ఉంచింది. మానసికంగా హింసిస్తున్నది. ఇమ్రాన్‌ను కలిసేందుకు మేంచేసిన ఈ పోరాటం మొదటి
అడుగు మాత్రమే. కోర్టు ఆర్డర్ ప్రకారం..ఇకపై రెగ్యులర్ గా ఆయనను కలవడానికి అనుమతించాలి" అని ప్రభుత్వాన్ని ఉజ్మా ఖాన్ డిమాండ్ చేశారు.
ఇమ్రాన్ మరణించారంటూ ఊహాగానాలు..
ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారంటూ ప్రచారం జరగడంతో పాక్‌లో ఉద్రిక్తత నెలకొంది. అడియాలా జైలు వద్ద ఇమ్రాన్ అనుచరులు ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారు. రావల్పిండిలో పీటీఐ భారీ నిరసనలు నిర్వహించాలని తలపెటట్టింది. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను తల్లిదండ్రులు, సిస్టర్స్, మద్దతుదారులు కలవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ రావల్పిండిలో భారీ నిరసనకు ప్లాన్ చేసింది.
ఇస్లామాబాద్ హైకోర్ట్ (ఐహెచ్సీ) వద్ద కూడా ప్రొటెస్ట్ ప్లాన్ చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. దాంతో పాకిస్తాన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అడియాలా జైల్ కు సంబంధించిన మార్గాలన్నింటిని బ్లాక్ చేసింది. పబ్లిక్ గ్యాదరింగ్స్‌ను నిషేధించే సెక్షన్ 144ను విధించింది.
