‘ఆర్కియాలజీ’లో ఇన్‌ఛార్జీల పాలన

‘ఆర్కియాలజీ’లో ఇన్‌ఛార్జీల పాలన

హైదరాబాద్‌‌, వెలుగుచరిత్ర పరిశోధన, పరిరక్షణ కోసం ఏర్పాటైన పురావస్తు శాఖ (ఆర్కియాలజీ)లో ఏళ్లకేళ్లు ఇన్‌‌చార్జిల పాలన సాగుతోంది. పూర్తిస్థాయి డైరెక్టర్‌‌ను నియమించకుండా చరిత్రతో సంబంధంలేని డిపార్ట్‌‌మెంట్‌‌ అధికారులను డిప్యుటేషన్‌‌పై నియమించడం, లేదంటే ఎవరికో ఒకరికి ఇన్‌‌చార్జి బాధ్యతలు అప్పగించడం ఈ శాఖలో పరిపాటిగా మారింది. ఏళ్లుగా తెలంగాణ చరిత్ర మరుగున పడిందని, రాష్ట్రం ఏర్పాటైతే చరిత్ర పునర్నిర్మాణ పనిని ప్రభుత్వమే చేపడుతుందని అంతా ఆశించారు. కానీ కేంద్ర పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలు మినహా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు చాలా తక్కువ.

అందరూ వచ్చిపోయేవాళ్లే..

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్కియాలజీ, మ్యూజియమ్స్‌‌ శాఖ పేరును ‘డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ హెరిటేజ్‌‌ తెలంగాణ’గా మార్చారు. ఉమ్మడి ఏపీలో ఈ శాఖకు 2012 నుంచి 2014 వరకు ఆరుగురు డైరెక్టర్లు ఇన్‌‌చార్జి హోదాలో పనిచేశారు. 2014 జూన్‌‌ నుంచి 8 నెలలు ఐఎఫ్‌‌ఎస్‌‌ అధికారి బి.శ్రీనివాస్‌‌, 2015, ఫిబ్రవరి నుంచి 8 నెలలు మరో ఐఎఫ్‌‌ఎస్‌‌ అధికారి సునీతా ఎం. భగవత్‌‌ ఇన్‌‌చార్జిగా పనిచేశారు. ఆ తర్వాత ఇండియన్‌‌ పోస్టల్‌‌ సర్వీస్‌‌ నుంచి డిప్యుటేషన్‌‌పై వచ్చిన ఎన్‌‌ఆర్‌‌ విశాలాచ్చి అక్టోబర్‌‌ 10, 2015 నుంచి ఏప్రిల్ 28, 2016 వరకు చేశారు. తర్వాత డాక్టర్‌‌ కె.పద్మనాభ 11 రోజులు చేశాక మళ్లీ విశాలాచ్చి బాధ్యతలు తీసుకుని ఏప్రిల్‌‌ 19, 2019 వరకు పనిచేశారు. ఏప్రిల్‌‌ 19 నుంచి మే 16 వరకు మరోమారు సునీతా ఎం భగవత్‌‌ ఇన్‌‌చార్జి డైరెక్టర్‌‌గా పనిచేయగా ప్రస్తుతం శాట్‌‌ వీసీ, ఎండీ దినకర్‌‌బాబు ఇన్‌‌చార్జిగా పనిచేస్తున్నారు. చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి చాటి చెప్పాల్సిన ఈ శాఖలో పోస్టింగ్‌‌ అంటే అధికారులు అప్రాధాన్య పోస్టింగ్‌‌గానే చూడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా చరిత్ర పరిశోధనపై ఆసక్తి ఉన్న అధికారులను డైరెక్టర్‌‌గా  నియమించి, నిర్లక్ష్యానికి గురవుతున్న చారిత్రక ప్రదేశాల పరిరక్షణకు నిధులు కేటాయించాలని ఔత్సాహిక పరిశోధకులు కోరుతున్నారు.

ఖాళీగా 100 పోస్టులు

రాష్ట్రంలో కొత్తగా లభ్యమయ్యే శాసనాలను పరిష్కరించేందుకు నిపుణులైన ఎపిగ్రఫిస్టులతోపాటు ధ్వంసమైన శిల్పాలను పునరుద్ధరించే శిల్పులు ఈ శాఖలో అందుబాటులో లేరు. వీరితోపాటు మ్యూజియాలు, ఆఫీసుల్లో సుమారు వంద పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.

అప్‌‌డేట్‌‌కాని హెరిటేజ్‌‌ వెబ్‌‌సైట్

తెలంగాణ హెరిటేజ్‌‌ డైరెక్టర్‌‌గా ఉన్న విశాలాచ్చి డిప్యూటేషన్‌‌ గడువు ముగియడంతో ఏప్రిల్‌‌ 19న తిరిగి పోస్టల్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత సునీతా ఎం. భగవత్‌‌ నెల రోజులు చేశాక మే 16 నుంచి దినకర్‌‌బాబు పనిచేస్తున్నారు. డైరెక్టర్‌‌ మారి నెలన్నర గడిచినా వెబ్‌‌సైట్‌‌లో మాత్రం ఇంకా విశాలాచ్చి పేరు, ఫొటోనే ఉన్నాయి.