
చేవెళ్ల: చేవెళ్ల సెగ్మెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య హ్యాట్రిక్ సాధించారు. అయితే, ఆదివారం జరిగిన కౌంటింగ్‌లో యాదయ్య తొలుత తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్‌పై కేవలం 262 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. కౌంటింగ్‌పై పామెన భీం భరత్ అనుమానం వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్ చేయాలని కోరారు.
దీంతో ఎన్నికల అధికారులు భీం భరత్ కోరిన విధంగా శంకర్ పల్లి మండలం గాజులగూడ, మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లోని 4 పోలింగ్ బూత్‌లలోని వీవీ ప్యాట్ల స్లిప్‌లను అబ్జర్వర్ల ఆధ్వర్యంలో మళ్లీ లెక్కించారు. ఎలాంటి తేడా రాకపోవడంతో 262 ఓట్ల మెజార్టీతో కాలె యాదయ్య గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో చేవెళ్ల నుంచి వరుసగా మూడోసారి గెలుపొందిన యాదయ్య సెగ్మెంట్ వాసులకు ధన్య వాదాలు తెలిపారు.