హైవేలపై వరద.. నిలిచిన ట్రాఫిక్‌‌

హైవేలపై వరద.. నిలిచిన ట్రాఫిక్‌‌

న్యూఢిల్లీ/ముజఫర్‌‌‌‌నగర్‌‌‌‌/ సహరాన్‌‌పూర్‌‌‌‌/ముంబై: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌‌, మహారాష్ట్రలో పడుతున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌‌ జారీ చేయడంతో పాటు నోయిడాలో స్కూళ్లను మూసివేశారు. మానేసర్‌‌‌‌ వద్ద ఢిల్లీ-, జైపూర్‌‌‌‌ హైవేపై వరద ప్రవాహానికి తీవ్ర ట్రాఫిక్‌‌ జామ్‌‌ ఏర్పడింది. గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. 

ఇండ్లల్లోకి వరద నీరు..

ఉత్తరప్రదేశ్‌‌లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ఇండ్లు ధ్వంసం అయ్యాయి. గోడలు కూలిపోయాయి. ఆయా ఘటనల్లో మొత్తం 13 మంది మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. మరోవైపు హర్యానాలో కూడా భారీగా వానలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. మహారాష్ట్ర ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. అయితే, పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌కు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని వెల్లడించారు.