జూపల్లి క్యాంప్​ ఆఫీస్ ​ముందు బిడ్డతో మహిళ బైఠాయింపు

జూపల్లి క్యాంప్​ ఆఫీస్ ​ముందు బిడ్డతో మహిళ బైఠాయింపు
  • భర్త విడిచి వెళ్లాడని, న్యాయం చేయాలని నిరసన
  • జూపల్లికి నమ్మకస్తుడినని బెదిరిస్తున్నాడని ఆరోపణ
  • సర్ది చెప్పి పంపిన అనుచరులు

కొల్లాపూర్, వెలుగు: తనకు న్యాయం చేయా లంటూ సోమవారం కాంగ్రెస్​ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంప్​ ఆఫీస్​ ఎదుట ఓ మహిళ చిన్న పిల్లవాడితో నిరసనకు దిగింది. ఆస్తి కోసం తన భర్త గోపాల అంజి తనను వదిలేశాడని, జూపల్లి అనుచరుడనని, కేసులు పెట్టినా తననెవరూ ఏమీ చేయలేరని భయపెడుతున్నాడని బాధితురాలు తెలిపింది. మేడ్చల్ ​పట్టణానికి చెందిన మౌనిక, నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ ​నియోజకవర్గం కోడేరు మండలం రాజాపూర్​ గ్రామానికి చెందిన గోపాల అంజి ప్రేమించుకొని పెండ్లి చేసుకున్నారు. వీరికి బాబు పుట్టాడు. తర్వాత ఆస్తి కావాలంటూ తనను వదిలి దూరంగాఉంటున్నాడని మౌనిక చెప్పింది.

తాను జూపల్లి కృష్ణారావుకు నమ్మకమైన కార్యకర్తనని, ఏం జరిగినా నిమిషాల్లో వస్తాడని చెబుతూ తనను బెదిరిస్తున్నాడని, దీంతో న్యాయం చేయాలని జూపల్లి ఇంటికి వస్తే తనను కలవనీయకుండా చేశారని వాపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో బైఠాయించాల్సి వచ్చిందని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత జూపల్లి అనుచరుడొకరు ఆమెను క్యాంప్​ఆఫీసులోకి తీసుకువెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఇక్కడికి వచ్చి గొడవ చేయడం సరైంది కాదని సర్ది చెప్పారు. దీంతో ఆమె అక్కడే  భోజనం చేసి వెళ్లిపోయింది.