పగలు కూడా స్వెట్టర్లే.. హైదరాబాద్ లో 10 డిగ్రీలు

పగలు కూడా స్వెట్టర్లే.. హైదరాబాద్ లో 10 డిగ్రీలు

తెలుగు రాష్ట్రాలు చలితో వణుకుతున్నాయి. ముఖ్యంగా చలితో హైదరాబాద్ వాసులు గజ.. గజ వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది.

ఈ చలి రానున్న రెండు రోజుల్లో 11-12 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య గాలులు వీయడం వల్ల ఉష్ణోగ్రతలో ఈ ఆకస్మిక ఉష్ణోగ్రత తగ్గుదల కనిపిస్తోంది.

ఈ మధ్య సైక్లోన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మొదలైన చలితీవ్రత.. క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఉదయం పది గంటలైనా రోడ్లపై మంచుతెరలు తొలగడం లేదు. సాయంత్రం ఆరుదాటితే పొగమంచు కమ్మేస్తోంది. రానున్న మూడురోజులు చలితీవ్రత మరింత పెరగవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది.

చలి కారణంగా ఉదయం వాకింగ్‌ చేసేవారి సంఖ్య చాలా వరకు తగ్గింది. మరో రెండు రోజులు పాటు గరిష్ఠంగా 27, కనిష్ఠంగా 16 డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రతలు ఉంటాయని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

తూర్పు, ఆగ్నేయం వైపు నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాత్రివేళల్లోనే కాకుండా పగటి ఉష్ణోగ్రతలూ పడిపోతున్నాయని, రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నదని హెచ్చరించింది. రాష్ట్రంలో చాలా చోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వెల్లడించింది.

కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పొగమంచు కమ్ముకుంటోంది. హైదరాబాద్‌ - వరంగల్‌ - ఛత్తీస్‌గఢ్‌, హైదరాబాద్‌ - విజయవాడ, హైదరాబాద్‌ - నిజామాబాద్‌, కరీంనగర్‌ మార్గాల్లో ఉదయం సమయాల్లో పొగమంచు అలుముకుంటుండటంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది. మూల మలుపుల వద్ద వాహనాల వేగం తగ్గించుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో రాత్రిళ్లు జనం బయటకు రాలేకపోతున్నారు. ఎక్కడ చూసినా చలికోట్లు, తలపాగాలతో కనిపిస్తున్నారు.