
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకోవడమే ఆ కానిస్టేబుల్ పాపమైంది. ఇసుక తరలిస్తున్న వ్యక్తి తమను అడ్డుకుంటున్నారన్న కోపంతో ట్రాక్టర్ని ఏకంగా కానిస్టేబుల్‌పైకి ఎక్కించాడు. ఈ ఘటనలో పోలీస్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటక రాష్ర్టంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కలబురిగి జిల్లా నిలోగి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మైసూర్ చౌహాన్(51) అనే కానిస్టేబుల్దుండగుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన అదే జిల్లాలోని అఫ్జల్పూర్ తాలుకాకు చెందిన వారు.
జెవర్గీ తాలుకా నారాయణపూర్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకుని చౌహాన్ తోటి సిబ్బందితో కలిసి ఇసుక మైనింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. వారిని ఆయన ప్రశ్నించగా ట్రాక్టర్ డ్రైవర్ విచక్షణ మరిచి చౌహాన్ మీది నుంచి ట్రాక్టర్ పోనించాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇలా జరగడం బాధగా ఉందని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని కర్ణాటక మంత్రి ఎంసీ సుధాకర్ హామీ ఇచ్చారు. నారాయణపూర్ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు లు వెళ్లాయి. ఆ ప్రాంతంలోనే కానిస్టేబుల్ చౌహాన్‌కి పోస్టింగ్ ఇచ్చారు.
బీజేపీ మండిపాటు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అక్రమార్కుల రెచ్చిపోతున్నారని బీజేపీ నేతలు మండి పడుతున్నారు. ఆ పార్టీ నేషనల్స్పోక్స్ పర్సన్షెజాద్ పునావాలా మాట్లాడుతూ.. కానిస్టేబుల్ మృతి చెందటం బాధాకరం అన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత లా అండ్ ఆర్డర్ఏ రకంగా ఉందో ఈ ఘటన తెలియజేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అక్రమార్కులకు, ఇసుక మాఫీయాకు అండగా నిలుస్తోందని ఆరోపించారు.