
మహారాష్ట్రలో 432మంది, గుజరాత్ లో197మందిమృతి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, గుజరాత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అత్యధికంగా మరణాలు ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. దేశంలోని కరోనా మరణాల్లో 60 శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,077 మంది మృతి చెందగా.. ఒక్క మహారాష్ట్ర, గుజరాత్ లలోనే కలిపి 629 మంది మరణించారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 432 మంది, గుజరాత్ లో 197 మంది చనిపోయారు. అహ్మదాబాద్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ సిటీలో బుధవారం ఒక్కరోజే 9 మంది మరణించగా, ఇప్పటి వరకు 137 మంది చనిపోయారు. మహారాష్ట్రలోని ముంబైలోనూ పరిస్థితి దయనీయంగా ఉంది. రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 32 మంది మరణించగా, వారిలో 25 మంది ముంబైకి చెందినవారే. ఆ రాష్ట్రాల తర్వాత అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 130 మంది, ఢిల్లీలో 54 మంది, రాజస్థాన్‌లో 55 మంది, ఉత్తర్ ప్రదేశ్ లో 39 మంది, తమిళనాడులో 27 మంది మరణించారు.
కేసుల్లోనూ టాప్…
కరోనా కేసుల్లోనూ మహారాష్ట్ర, గుజరాత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 9,915 కేసులు నమోదవ్వగా, 1,593 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 7,890 మంది ట్రీట్ మెంట్ పొం దుతున్నారు. ఇక గుజరాత్ లో 4,082 కేసులు నమోదవ్వగా, 527 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,358 మంది ట్రీట్ మెంట్ పొందుతున్నారు. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 1,576 కొత్త కేసులు రికార్డు కాగా, అందులో 597 కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇక గుజరాత్‌లో 308 కేసులు నమోదు కాగా, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లలో 170కు పైగా చొప్పున కేసులు రికార్డయ్యాయి.
పంజాబ్ లో మరో2 వారాలు లాక్‌డౌన్
లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ఎత్తి వేయడానికి సలహాల కోసం నియమించిన ఎక్స్‌పర్ట్ కమిటీ రిపోర్టు ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం అమరీందర్ సింగ్ చెప్పారు. మే 17 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందన్నారు. గురువారం నుంచి కొన్ని సడలింపులు ఇస్తామన్నారు. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రావచ్చన్నారు. కంటెయిన్‌మెంట్, రెడ్ జోన్లలో సడలింపులుండవన్నారు. షాపులు, ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగ కార్యకలాపాలకు లాక్‌డౌన్ నుంచి సడలిం పులు ఇస్తున్నట్టు వెస్ట్‌బెంగాల్ ప్రకటించింది. గ్రీన్ జోన్ లోని స్టేషనరీ, పెయింట్, ఎలక్ట్రానిక్స్, హార్వేర్, డ్ లాండ్రీ, టీ, పాన్షాపులను మే 1 నుంచి ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది.