మల్లన్నసాగర్‌‌లో ఉన్నవన్నీ ఎస్సారెస్పీ నీళ్లే

మల్లన్నసాగర్‌‌లో ఉన్నవన్నీ ఎస్సారెస్పీ నీళ్లే
  • ...అయినా కాళేశ్వరం నీళ్లంటూ గొప్పలు
  • మేడిగడ్డ నుంచి ఈ వాటర్​ 
  • ఇయర్​లో ఎత్తిపోసిందే 35 టీఎంసీలు
  • అందులో 15 టీఎంసీలకు పైగా సముద్రంపాలు
  • రేపు మల్లన్నసాగర్‌‌ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌‌, వెలుగు: మల్లన్నసాగర్‌‌లో ఉన్నవన్నీ శ్రీరాంసాగర్‌‌ (పోచం పాడు) ప్రాజెక్టు నుంచి తరలించిన నీళ్లే అయినా.. అవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే లిఫ్ట్‌‌ చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ నుంచి ప్రస్తుత వాటర్‌‌ ఇయర్‌‌ (2021-–22)లో ఎత్తిపోసిందే 35 టీఎంసీలు.. అందులో మిడ్‌‌ మానేరుకు లిఫ్ట్‌‌ చేసింది 23 టీఎంసీలు మాత్రమే. ఏటా వానాకాలం మొదట్లో కింది నుంచి నీళ్లు లిఫ్ట్‌‌ చేయడం.. ఆ తర్వాత గోదావరి వరదలతో ఉప్పొంగి ఎత్తిపోసిన నీళ్లను సముద్రంలోకి వదిలేయడం పరిపాటే. ఈసారి కూడా అట్లనే కింది నుంచి ఎత్తిపోసిన నీళ్లల్లో 15 టీఎంసీలకు పైగా సముద్రం పాలయ్యాయి. జులై ఏడో తేదీ తర్వాత అసలు లింక్‌‌ -1 (మేడిగడ్డ ‑– ఎల్లంపల్లి), లింక్‌‌ - 2 (ఎల్లంపల్లి – మిడ్‌‌ మానేరు) మోటార్లే నడుపలేదు. భారీ వరదలు రావడంతో పంపులకు రెస్ట్‌‌ ఇచ్చారు. అయినా మల్లన్నసాగర్‌‌లోకి చేరిన నీళ్లన్నీ కాళేశ్వరం నుంచి ఎత్తిపోసినవే అని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. సీఎం కేసీఆర్‌‌ మల్లన్నసాగర్‌‌ను బుధవారం ప్రారంభించనున్నారు.

డ్యాం ప్రొటోకాల్​ ప్రకారం..!

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా రీ డిజైన్‌‌ చేసిన తర్వాత 1.5 టీఎంసీల తడ్కపల్లి రిజర్వాయర్‌‌ కెపాసిటీని 50 టీఎంసీలకు పెంచి కొమురవెల్లి మల్లన్నసాగర్‌‌గా మార్చారు.
రూ.6,805 కోట్లతో చేపట్టిన ఈ రిజర్వాయర్‌‌ కింద 14 గ్రామాల్లోని 17,781 ఎకరాల భూములు ముంపునకు గురయ్యాయి. 10.50 కి.మీ.ల పొడవైన గుట్టలను కలుపుతూ 22.6 కి.మీ.ల పొడవు, 557 మీటర్ల ఎత్తయిన కట్ట నిర్మించారు. మిడ్‌‌ మానేరు నీళ్లను అనంతగిరి, రంగనాయకసాగర్‌‌, తడ్కపల్లి పంపుహౌస్‌‌ల ద్వారా మల్లన్నసాగర్‌‌లోకి ఎత్తిపోస్తారు. ప్రస్తుత వాటర్​ ఇయర్​ వానాకాలంలో ఈ మూడు పంపు హౌస్‌‌ల నుంచి మల్లన్నసాగర్‌‌లోకి 10.50 టీఎంసీలకుపైగా నీళ్లు ఎత్తిపోశారు. సోమవారం నాటికి ఈ రిజర్వాయర్‌‌లో 10.64 టీఎంసీల నీళ్లున్నాయి. డ్యాం ప్రొటోకాల్‌‌ ప్రకారం క్రమేణా ఈ రిజర్వాయర్‌‌ను పూర్తిగా నింపాల్సి ఉంటుంది. ఇందుకు ఇంకో రెండేండ్ల సమయం పట్టనుంది.

మిడ్​ మానేరు నుంచి 10 టీఎంసీల నీళ్లు వృథా

కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్‌‌ 21న అధికారికంగా ప్రారంభించారు. మొదటి ఏడాది వానాకాలంలో 11.88 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ నుంచి లిఫ్ట్‌‌ చేశారు. ఆ ఏడాది నవబర్‌‌ నుంచి ఏప్రిల్‌‌ వరకు ఆరు విడతల్లో 48.22 టీఎంసీలు లిఫ్ట్‌‌ చేశారు. మొదట ఎత్తిపోసిన నీళ్లన్నీ తర్వాత వరదలు వచ్చి సముద్రంలోకి వదిలేయగా, తర్వాత ఎత్తిపోసిన నీటిని ఎల్‌‌ఎండీకి దిగువన ఉన్న ఎస్సారెస్పీ ఆయకట్టుకు యాసంగి సీజన్‌‌లో ఇచ్చారు. రెండో ఏడాది (2020 –-21) వానాకాలం సీజన్‌‌లో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన 8 టీఎంసీలు తర్వాత ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో సముద్రంలోకి వదిలేశారు. తర్వాత ఎత్తిపోసిన 26.5 టీఎంసీల్లో సగానికిపైగా నీళ్లను ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఇచ్చారు. మిగతా నీళ్లను అనంతగిరి, రంగనాయకసాగర్‌‌, కొండపోచమ్మసాగర్‌‌కు తరలించారు. ప్రస్తుత వాటర్‌‌ ఇయర్‌‌ (2021 –- 22)లో జులై 7వరకు మాత్రమే పంపులు నడిపి మేడిగడ్డ నుంచి 35 టీఎంసీలు ఎత్తిపోశారు. అన్నారం నుంచి 30.72, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి 32 టీఎంసీలు, ఎల్లంపల్లి నుంచి నందిమేడారం ద్వారా 23.45 టీఎంసీలు, లక్ష్మీపూర్‌‌ పంపుహౌస్‌‌ నుంచి మిడ్‌‌ మానేరుకు 23 టీఎంసీలు ఎత్తిపోశారు. ఆ నీటిని ఎల్ఎండీకి విడుదల చేసినా అప్పటికే ఎగువ నుంచి వరదలు రావడంతో గేట్లు ఎత్తి మానేరులోకి వదిలేయాల్సి వచ్చింది. ఇలా ప్రస్తుత వాటర్​ ఇయర్​లో 10 టీఎంసీల వరకు నీళ్లు వృథా అయ్యాయి.

సింగూరుకు కాళేశ్వరం లింకే కాలే..!

కాళేశ్వరం ప్రారంభించిన మొదటి రెండేండ్లు యాసంగి సీజన్‌‌కు మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్లు ఎస్సారెస్పీ ఆయకట్టుకైనా ఉపయోగపడగా, ప్రస్తుత వాటర్​ ఇయర్​లో ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోయాల్సిన అవసరమే రాలేదు. కానీ, ప్రాజెక్టుకు మైలేజ్‌‌ పెంచేందుకు వానాకాలం ఆరంభంలో ఎత్తిపోసిన నీళ్లను తర్వాత గేట్లు ఎత్తి కిందికి వదిలేయాల్సి వచ్చింది. జులై ఏడో తేదీ తర్వాత అసలు ఈ ప్రాజెక్టు మోటార్లు ఆపరేట్‌‌ చేయాల్సిన అవసరమే రాలేదు. అయినా మల్లన్నసాగర్‌‌కు మేడిగడ్డ నుంచే నీళ్లు ఎత్తిపోశామని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. ప్రస్తుత వాటర్​ ఇయర్​లో సింగూరుకు 101.42 టీఎంసీల వరద వచ్చింది. ఇందులో 25.91 టీఎంసీలు ఇంకా నిల్వ ఉన్నాయి. కాళేశ్వరం నుంచి సింగూరు ప్రాజెక్టుకు లింక్‌‌ చేసే పనులే పూర్తి కాలేదు. కానీ సోమవారం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన సందర్భంగా కాళేశ్వరం నీళ్లే ఆ రెండు లిఫ్టులకు ఇస్తామని గొప్పలు చెప్పుకున్నారు. మల్లన్నసాగర్‌‌ విషయంలో అదే తరహాలో ప్రచారం చేసుకుంటున్నారు.

వరద నీటినే..!

ఈ ఫ్లడ్‌‌ సీజన్‌‌లో ఎస్సారెస్పీకి 677.34 టీఎంసీల వరద రాగా ప్రస్తుతం 58.93 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మిడ్‌‌ మానేరుకు 69.81 టీఎంసీల ఇన్‌‌ఫ్లో రాగా 17.17 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎల్‌‌ఎండీకి 125.87 టీఎంసీల వరద రాగా 16.65 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎల్లంపల్లికి 1,067.81 వరద రాగా 18.31 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ వాటర్​ ఇయర్​(2021–22)లో ఎస్సారెస్పీకి వచ్చిన వరద నీళ్లనే ఫ్లడ్‌‌ ఫ్లో కెనాల్‌‌ ద్వారా మిడ్‌‌ మానేరుకు మళ్లించి ఆ నీటినే అనంతగిరి, ఇమాంబాద్‌‌ (రంగనాయకసాగర్‌‌), తడ్కపల్లి పంపుహౌస్‌‌ల ద్వారా మల్లన్నసాగర్‌‌కు తరలించారు. సోమవారం నాటికి అనంతగిరిలో 2.79, రంగనాయకసాగర్‌‌లో 2.43, మల్లన్నసాగర్‌‌లో 10.64, కొండపోచమ్మసాగర్‌‌లో 6.62 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎస్సారెస్పీకి వచ్చిన వరద నీటిని సమర్థవంతంగా ఉపయోగించి ఉంటే కొండపోచమ్మసాగర్‌‌లో ఇంకో ఐదు టీఎంసీల వరకు నింపుకునే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం చేయలేదు.