బడికి తాళం వేసి గ్రామస్తుల నిరసన

 బడికి తాళం వేసి గ్రామస్తుల నిరసన

భద్రాద్రి కొత్తగూడెం: మొత్తం పాఠశాలకు ఒకరే ఉపాధ్యాయుడ్ని కొనసాగిస్తుండడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. దమ్మపేట మండలంలోని మల్లారం గ్రామంలో మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలకి విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేశారు. మల్లారం ప్రాధమిక పాఠశాలలో 45 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు మాత్రం ఒక్కరే ఉన్నారని.. అన్ని తరగతులకు ఒకే ఉపాధ్యాయులు ఎలా బోధిస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదనంగా మరికొందరు టీచర్లను నియమిస్తే.. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది కదా అని వారు ప్రశ్నించారు. ఒకే ఉపాధ్యాయుడిని కొనసాగించడం వల్ల చాలా మంది అప్పులు చేసి ప్రైవేటు స్కూళ్లకు పంపించి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. కూలీ నాలీ చేసుకునే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుకు పంపలేక నిస్సహాయంగా ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ స్కూళ్లను బలోపేతం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం తమ గ్రామ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులను నియమించడంతోపాటు మౌళిక వసతులు కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.