స్కూళ్లలో ప్రారంభం కాని మన ఊరు మన బడి..విద్యార్థుల ఇబ్బందులు

స్కూళ్లలో ప్రారంభం కాని మన ఊరు మన బడి..విద్యార్థుల ఇబ్బందులు

మన ఊరు మన బడి’ కింద ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఇటీవల ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ పనులు కాగితాల్లో తప్ప ఆచరణలో కనిపించడం లేదు. మెదక్​ జిల్లాలో చాలా స్కూళ్లలో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన చోట స్లోగా జరుగుతున్నాయి. విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు.

మెదక్, వెలుగు :  జిల్లాలోని 21 మండలాల్లో 624 ప్రైమరీ, 128 అప్పర్​ ప్రైమరీ, 148 హైస్కూల్స్​ ఉన్నాయి. కాగా మన ఊరు మన బడి పథకం కింద ఫస్ట్​ ఫేజ్​లో 313 స్కూళ్లను సెలక్ట్​ చేశారు. ఆయా స్కూల్​లలో అదనపు గదులు, టాయిలెట్లు, కిచెన్ షెడ్ లు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, తాగునీటి వసతి, కరెంట్ సౌకర్యం పనులు కల్పించేందుకు రూ.53 కోట్లతో అంచనాలు రూపొందించి పంపించారు. వీటిలో రూ.30 లక్షల లోపు విలువైన పనులను నామినేషన్​ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించారు. 50 స్కూళ్లలో రూ.30 లక్షల కంటే ఎక్కువ విలువైన పనులకు టెండర్​ నిర్వహించాల్సి ఉంది. కరెంట్, తాగునీటి వసతి కల్పన, కిచెన్​ షెడ్​ల నిర్మాణం లాంటి రూ.30 లక్షల లోపు విలువైన పనులు 250 స్కూళ్లలో ఉండగా వాటిలో 190 పనులు మొదలైనట్టు అధికారులు చెబుతున్నారు. 
కానీ వాస్తవానికి అన్నిచోట్ల పనులు జరగడం లేదు. మొదలైన చోట్ల కూడా పనులు చాలా స్లోగా జరుగుతున్నాయి. 

రామాయంపేట మండలం అక్కన్నపేట పాఠశాలలో  కాంపౌండ్ వాల్, సంపు, టాయిలెట్స్ నిర్మాణం, ఎలక్ట్రికల్ వర్క్ చేసేందుకు రూ.7 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పనులు మొదలు కాలేదు. ఇదివరకు స్కూల్​ పేరు మీద ఉన్న పాత బ్యాంక్​ అకౌంట్ పని చేయదంటున్నారని, కెనరా బ్యాంకులో కొత్త ఖాతా తీయాలంటున్నారని స్కూల్​ హెడ్మాస్టర్​ తెలిపారు. పాపన్నపేటలోని జిల్లా పరిషత్​  హైస్కూల్ లో 530 మంది విద్యార్థులు ఉండగా, స్కూల్​కు ప్రహారీ, బాత్​ రూమ్​లు, కిచెన్​ షెడ్​ నిర్మాణం కోసం రూ.30.20 లక్షలు మంజూరయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పనులు మొదలు కాలేదు. 

నిజాంపేట ప్రైమరీ స్కూల్ లో వివిధ పనులు చేపట్టేందుకుగాను రూ.86 లక్షలు మంజూరు అయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టాలో ఆఫీసర్లు చెప్పడం లేదని పాఠశాల హెడ్ మాస్టర్ ప్రభాకర్ తెలిపారు.కౌడిపల్లిలోని గర్ల్స్​ హైస్కూల్​లో నాలుగు అదనపు తరగతి గదులు, కిచెన్​ షెడ్​, డ్రింకింగ్​ వాటర్​, ఎలక్ట్రిసిటీ పనుల కోసం రూ.21.45 లక్షలు మంజూరయ్యాయి. కానీ ఫండ్స్ ​రిలీజ్​కాక పనులు మొదలు కాలేదు. ఇలాంటి పరిస్థితే చాలా చోట్ల ఉంది. దీంతో విద్యార్థులు, టీచర్ లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలని పలువురు 
కోరుతున్నారు. 

పనులు జరుగుతున్నయ్...

మన ఊరు మన బడి పథకం కింద మొదటి దశలో జిల్లాలో 313 స్కూల్​లు ఎంపిక కాగా, 19‌‌‌‌0 స్కూళ్లలో పనులు మొదలయ్యాయి. రూ.30 లక్షల కంటే ఎక్కువ విలువైన పనులకు సంబంధించి టెండర్​ ప్రక్రియ కొనసాగుతోంది. టెండర్లు ఖరారు కాగానే పనులు చేపడతాం.
– రమేశ్​కుమార్, డీఈవో, మెదక్​