- ఫిబ్రవరిలో 200 యూనిట్లలోపు వినియోగం
- ఇప్పుడు యూనిట్ల పరిధి దాటడంతో బిల్లులు వస్తున్నయ్
- బిల్లులు చూసి షాకవుతున్న వినియోగదారులు
హైదరాబాద్, వెలుగు: మార్చి నెలలో కరెంటు వినియోగం భారీగాపెరిగింది. వేసవి త్రీవత, ఉక్కపోతలతో ఉక్కిరికి బిక్కిరి అయిన వినియోగదారులు కరెంటు ఎక్కువ వాడడంతో కరెంటు మీటర్లు గిర్రున తిరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో గృహ వినియోగదారులు పొదుపుగా కరెంటు వాడుకున్నారు. దీంతో 40 లక్షల మందికి జీరో బిల్ ఇచ్చారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ.200 కోట్ల మేర నిధులు అందించింది.
అయితే మార్చి మాసం వచ్చేసరికి సీన్ కాస్త రివర్స్ అయింది. ఫిబ్రవరిలో పొదుపు మంత్రం పాటించిన వినియోగదారులు.. మార్చిలో భారీగా కరెంటు వాడారు. దీంతో ఫిబ్రవరిలో పొదుపుతో వచ్చిన జీరో బిల్లు కాస్తా మార్చిలో వాడకం 200 యూనిట్లు దాటడంతో జీరో బిల్లుల స్థానంలో చెల్లింపు బిల్లులు వచ్చాయి. దీంతో కరెంటు ఫ్రీగా వస్తున్నా పొదుపు చేయలేకపోతున్నామని గృహ వినియోగదారులు గొల్లుమంటున్నరు.
మార్చిలో విద్యుత్ వాడకం గతంలో ఎన్నడూలేని విధంగా భారీగాపెరిగిపోయింది. ఆ నెల మొత్తం రోజువారి సగటు వినియోగం 289.71 మిలియన్ యూనిట్లు జరిగింది. అత్యధికంగా మార్చి 14న 308.54 మిలియన్ యూనిట్ల కరెంటు వాడారు. దీంతో లక్షల మంది గృహ వినియోగదారుల కరెంటు బిల్లులు 200 యూనిట్లు దాటేశాయి. దీంతో బిల్లులు చూసుకుని గృహ వినియోగదారులు షాక్ అవుతున్నారు. 200 యూనిట్ల లోపు వాడుకుంటే జీరో బిల్లు వచ్చేది. 200 యూనిట్లు దాటినా, నమోదైనా బిల్లు రూ.వెయ్యి దాటుతోంది.
వాడకం పెరిగి డిమాండ్ ఎక్కువైంది
గత నెల 8న రికార్డు స్థాయిలో 15,623 మెగావాట్ల పీక్ విద్యుత్ డిమాండ్ నమోదైంది. కనిష్ట డిమాండ్ కూడా 13,157 మెగావాట్లుగా ఉంది. 2023 మార్చి నెలలో తక్కువ డిమాండ్ 9,468 మెగావాట్లు మాత్రమే నమోదైంది. అంటే గత నెలలో కనిష్ట డిమాండ్ కూడా నిరుటి మార్చి కన్నా 3,689 మెగావాట్లు ఉండడం గమనార్హం.
ఉక్కపోతలతో వాడకం ఎక్కువైంది
ఉక్కపోతలతో పోయిన నెల కరెంటు వాడకం ఎక్కువైంది. అంతకుముందు నెల పొదుపుగా వాడుకున్నవాళ్లకు జీరో బిల్లు ఇచ్చాం. మార్చిలో ఎండలు భరించలేక ఫ్యాన్లు, కూలర్లు వాడిన వాళ్లకు ఇప్పుడు 200 యూనిట్లు దాటింది. పొదుపుగా వాడితే లాభం ఉండేదని బిల్లులు చూశాక వినియోగదారులు అనుకుంటున్నరు.
- సునీల్, మీటర్ రీడర్ , వరంగల్ జిల్లా