సోమాలియాలో టెర్రర్ దాడి.. 32 మంది మృతి.. మరో 63మందికి గాయాలు

సోమాలియాలో టెర్రర్ దాడి.. 32 మంది మృతి.. మరో 63మందికి గాయాలు

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో శుక్రవారం రాత్రి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. అత్యంత రద్దీగా ఉండే సముద్రతీరంలోని లిడో బీచ్‌‌ హోటల్‌‌లో ఆత్మాహుతి దాడితోపాటు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక జవానుతో సహా 32 మంది చనిపోయారు. మరో 63 మంది గాయపడ్డారు. వీకెండ్ వల్ల రద్దీగా ఉన్న లిడో బీచ్‌‌ హోటల్‌‌లోకి టెర్రరిస్టులు చొరబడి మొదట కాల్పులు జరిపారని అధికారులు వెల్లడించారు.

అక్కడి జనంపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని తెలిపారు. అందులో ఓ టెర్రరిస్ట్ తనను తాను బాంబుతో పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని చెప్పారు. దాంతో చాలా మంది చనిపోయారని.. డెడ్ బాడీలు చెల్లాచెదురుగా పడిపోయాయని వివరించారు. దాడికి పాల్పడిన టెర్రరిస్టులందరిని భద్రతా బలగాలు హతమార్చాయని.. పేలుడు పదార్థాలతో కూడిన కారును డ్రైవ్ చేసిన మరొకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని చెప్పారు. టెర్రరిస్టులతో జరిగిన కాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయని తెలిపారు. సోమాలియాలో ఇటీవల జరిగిన టెర్రర్ దాడులలో ఇదే పెద్దదన్నారు. ఈ దాడికి అల్- ఖైదా- సంబంధిత అల్ -షబాబ్ టెర్రర్ గ్రూప్ బాధ్యత వహించిందని పేర్కొన్నారు. అల్ -షబాబ్ గ్రూప్ చాలా ఏండ్లుగా సోమాలియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు చేస్తున్నది. రాజధానితోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ  అనేక బాంబు దాడులు చేసింది.