భగీరథ నీళ్లపై తప్పుడు లెక్కలు 

భగీరథ నీళ్లపై తప్పుడు లెక్కలు 

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని అన్ని ఊర్లకు మిషన్ భగీరథ నీటిని వందకు వంద శాతం అందిస్తున్నట్లుగా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. గ్రామాల్లో చూస్తే మాత్రం పరిస్థితి మరోలా కన్పిస్తోంది. మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచే నీళ్లు నేరుగా ఊర్లల్లోని ట్యాంకులకు వస్తాయని, ఇకపై జీపీలకు కరెంట్ బిల్లుల బాధలు, మోటార్ల రిపేర్ ఖర్చులు ఉండవని సర్కార్ పెద్దలు చెప్పారు. కానీ.. చాలా ఊర్లల్లో మిషన్ భగీరథ నీళ్లు లేక గతంలో ఉన్న బావులు, బోర్లనే వాడుకోక తప్పడం లేదు. దీంతో నెలనెలా మోటార్లకు కరెంట్ బిల్లులు, మోటార్లు కాలితే రిపేర్ ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతున్నాయి. చిన్న గ్రామాల్లో తాగునీటి కోసం నెలనెలా రూ.30వేల వరకు  ఖర్చు చేస్తుండగా, మేజర్ పంచాయతీల్లో రూ.70 వేల దాకా ఖర్చవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే15వ ఫైనాన్స్​కమిషన్ నిధుల్లో 20 శాతం నిధులను సీసీ చార్జీలు, మోటార్ రిపేర్లకే ఖర్చు చేయాల్సి వస్తోంది. మిషన్ భగీరథ వచ్చినా తాగునీటిపై జీపీలకు ఖర్చు తగ్గలేదని సర్పంచులంటున్నారు.  

కేంద్రం నిధులతోనే.. 

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఏడాదిన్నర క్రితమే అన్ని గ్రామాల్లో బోర్లు, బావులకు ఉన్న మోటార్లు తీసేయాలని, వాటిని వాడొద్దని ఏకంగా సర్క్యులర్​ జారీ చేసింది. కానీ చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్​లైన్ పనులు పూర్తి కాకపోవడం, పూర్తయిన చోట సరైన ప్రెషర్​తో నీళ్లు రాకపోవడంతో పాత బావులు, బోర్ల నుంచి సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు తాగునీరు పంపింగ్ చేస్తున్నారు. దీంతో మోటార్లకు నెలనెలా కరెంట్ బిల్లులు చెల్లించక తప్పడం లేదు. గ్రామ స్థాయిలో మిషన్​ భగీరథకయ్యే ఖర్చంతా కేంద్రం గ్రామాలకు విడుదల చేసే15వ ఫైనాన్స్​కమిషన్ గ్రాంట్ల నుంచే ఖర్చు చేస్తున్నారు. ఒక రకంగా కేంద్రం ఇచ్చే నిధులతోనే తాగునీటిని సప్లై చేస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం మిషన్ భగీరథ నిర్వహణకు ఏటా రూ.2,110 కోట్లు ఇవ్వాలని కోరినా కేంద్రం పైసా ఇవ్వడం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. 

పంచాయతీల్లో పూర్తిగా భగీరథ నీటినే వాడుతున్నామని, మిగతా మోటార్లు ఏవీ ఉపయోగించడం లేదని భగీరథ వాటర్ మాన్ ప్రతి వారం సర్పంచుల నుంచి బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారు. ప్రతినెలా ఎన్ని లీటర్ల నీళ్లు సరఫరా చేస్తున్నారో నివేదికలు రూపొందిస్తున్నారు. అధికారుల ఒత్తిడి మేరకు సంతకాలు చేయాల్సి వస్తోందని హన్మకొండ జిల్లాకు చెందిన సర్పంచ్ చెబుతున్నారు.  

వాటర్ ప్లాంట్ల నీళ్లకే జనం మొగ్గు 

భగీరథ నీళ్లొచ్చాక వాటర్ ప్లాంట్లను మూసేయాల్సిందేనని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ భగీరథ నీళ్ల సరఫరా మొదలయ్యాక గ్రామాల్లో వాటర్ ప్లాంట్ల సంఖ్య పెరిగింది. బాలవికాస, సేఫ్ వాటర్ నెట్ వర్క్(ఐజల్) తదితర స్వచ్ఛంద సంస్థలు, వివిధ ట్రస్టుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లకు ఇప్పటికీ ప్రజలు క్యూ కడుతున్నారు. సాక్షాత్తూ మిషన్ భగీరథ మినిస్టర్ గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో తన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించిన వాటర్ ప్లాంట్ల నుంచే పాలకుర్తి నియోజకర్గంలో ఇప్పటికీ ప్రజలకు తాగునీళ్లు అందుతున్నాయి.  

ఒక్కో జీపీలో 30 మీటర్లు   

ఒక్కో పంచాయతీలో స్ట్రీట్ లైట్లు, బోర్లు, బావులు, పంచాయతీ ఆఫీస్, రైతు వేదిక, వైకుంఠధామం, నర్సరీ, తదితర అవసరాల కోసం 20 నుంచి 30 కరెంట్ మీటర్లు వినియోగిస్తున్నారు. ఇందులో స్ట్రీట్ లైట్లు, బోర్లు, బావులు(ఆర్​డబ్ల్యూఎస్​కు)కు చెందిన మీటర్లే 20 వరకు ఉంటున్నాయి. 

ఇప్పటికీ టార్గెట్ రీచ్ కాలే 

రాష్ట్రంలోని 96 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 23,890 హ్యాబిటేషన్‌‌‌‌లు, 121 మున్సిపాలిటీలకు మంచి నీళ్లు సప్లై చేయడానికి 2016లో మిషన్‌‌‌‌ భగీరథ స్కీమ్​ను ప్రభుత్వం చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 55.95 లక్షల ఇండ్లకు, పట్టణాల్లో 12.83 లక్షల ఇండ్లకు  ట్రీటెడ్‌‌‌‌ వాటర్‌‌‌‌ సప్లై‌‌ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.40 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఈ స్కీమ్​కు హడ్కో, కమర్షియల్‌‌‌‌ బ్యాంకుల నుంచి 80 శాతం నిధులు అప్పుగా తీసుకోగా.. మిగతా 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌‌‌‌ నుంచి కేటాయించింది. చాలా వరకు గ్రామాల్లో ఉన్న  వాటర్​ ట్యాంకులు, పైపులైన్లనే ఇందుకు వాడుకున్నా ఇప్పటికీ టార్గెట్ ను మాత్రం రీచ్​ కాలేదు.