ఈ నెల 28న బీసీల ఆత్మగౌరవ సభకు ప్లాన్!

ఈ నెల 28న బీసీల ఆత్మగౌరవ సభకు ప్లాన్!

హైదరాబాద్, వెలుగు: మునుగోడులో 30న సీఎం కేసీఆర్ ఎన్నికల సభ నిర్వహిస్తే... ఆ సభకు ముందు ఒకటి, ఆ తర్వాత మరొకటి పోటీ సభ నిర్వహించే ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ఒక సభకు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను చీఫ్ గెస్ట్​గా పిలవాలని బీజేపీ ప్లాన్​ చేస్తున్నది. మరో సభకు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ లలో ఒకరిని రప్పించాలని కమల దళం భావిస్తున్నది. ఈనెల 28న ఒక సభను, ప్రచారానికి ముగింపు రోజైన వచ్చే నెల 1న మరో సభ నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. బుధవారం ఢిల్లీలో బీజేపీలో చేరనున్న టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల 28న బీసీల ఆత్మగౌరవ సభను హైదరాబాద్​ శివారులో, ఇటు మునుగోడు నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న ఏరియాలో నిర్వహించాలని బీజేపీ స్టేట్​ లీడర్​షిప్​ ప్లాన్​ చేస్తున్నది. ఈ సభ  పెద్ద అంబర్ పేట లేదంటే బాట సింగారం, తొర్రూర్ లలో ఏదో ఒక చోట నిర్వహించే ఏర్పాట్లలో బీజేపీ ఉంది. ఈ సభ కాకుండా మునుగోడు నియోజకవర్గంలోనే రెండు ప్రచార సభలు నిర్వహించడంపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ రానున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

మునుగోడులోనే సీనియర్​ నేతల మకాం

మునుగోడులో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలంతా మకాం వేసి ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. మంగళవారం నుంచి సంజయ్ రోడ్ షోలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్  రెడ్డి, ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్, ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్​ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, సీనియర్ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జాతీయ నేతలలు కూడా ఇక్కడే మకాం వేశారు. జాతీయ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, సహాయ కార్యదర్శి అరవింద్ మీనన్ మునుగోడులో పార్టీ ముఖ్య నేతలతో, బూత్ ఇన్​చార్జీలతో భేటీ అవుతూ ప్రచారం తీరును పరిశీలిస్తున్నారు. 

క్యాంపెయిన్​పై ఎప్పటికప్పుడు ఆరా

గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై సునీల్​ బన్సల్, అరవింద్​ మీనన్​లు రాష్ట్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. పార్టీ ఆర్గనైజింగ్ జాయింట్ జనరల్ సెక్రటరీ శివ ప్రకాశ్ సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్, వివేక్ వెంకటస్వామితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ఆరా తీశారు. ప్రచార పర్వంలో టీఆర్ఎస్ కు పోటీగానే బీజేపీ జనంలోకి దూసుకెళ్లడం, మంచి  స్పందన రావడంతో కాషాయ దళం క్యాడర్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.