నారాయణఖేడ్లో అసలైన ఆట మొదలైంది : బండి సంజయ్

నారాయణఖేడ్లో అసలైన ఆట మొదలైంది : బండి సంజయ్

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నారాయణఖేడ్ లో అసలైన ఆట మొదలైంది.. 3 ఎకరాల సామాన్యుడికి, 3 వేల ఎకరాల ఆసామికి మధ్య యుద్ధం జరుగుతోంది.. ఆ గట్టునుంటారా?... ఈ గట్టున ఉంటారా ? ప్రజలే తేల్చుకోండి అని సవాల్ విసిరారు. ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ ను ధర్నాచౌక్ వరకూ గుంజుకొచ్చానని అన్నారు. 

ఎన్నికల్లో భాగంగా నారాయణఖేడ్ కు వెళ్లిన ఎంపీ బండి సంజయ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. బీజేపీ అభ్యర్థి సంగప్పతో కలిసి రాజశ్యామల యాగానికి హాజరయ్యారు. అక్కడి నుండి భవానీ మందిరంలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కర్నాటక ఎమ్మెల్యే ప్రభు చౌవాన్, సంగప్పతో కలిసి మంగళ్ పేట భవానీ మందిర్ నుండి బసవేశ్వర చౌక్ వైపుగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం బసవేశ్వర చౌక్ వద్ద ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. 

కేసీఆర్ పై కొట్లాడితే తనపై 74 కేసులు పెట్టారని, అయినా తాను భయపడనని చెప్పారు బండి సంజయ్. అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ చేసి.. పాతబస్తీలో సభ సక్సెస్ చేసి సత్తా చాటామన్నారు.12 శాతం ఓట్లకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒవైసీకి సలాం చేస్తున్నారని చెప్పారు. 80 శాతం ఉన్న నారాయణ్ ఖేడ్ హిందూ ఓట్లన్నీ ఏకమైతే సంగప్ప గెలవడా? అని ప్రశ్నించారు. పొరపాటున కేసీఆర్ కు మరోసారి అవకాశమిస్తే.. రాముడు అయోధ్యలోనే పుట్టలేదంటాడు? అని అన్నారు. 

నారాయణ్ ఖేడ్ లో 70 ఏళ్ల కుటుంబ పాలనను బద్దలు కొట్టండి అని పిలుపునిచ్చారు బండి సంజయ్. ఫ్యాక్షన్ రాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ.. 70 ఏళ్లుగా రెండు కుటుంబాలే పెత్తనం చెలాయిస్తూ నారాయణ్ ఖేడ్ అభివృద్ధి కాకుండా అడ్డుకున్నాయన్నారు. ఇకపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఇక్కడి ప్రజలకు సంగప్ప అండగా ఉంటారని, ఆయన వెనుక తాను.. ప్రధాని మోదీ ఉన్నారని భరోసా ఇచ్చారు.

సంగప్పను బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నారాయణఖేడ్ ను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్. ఇండస్ట్రీ హబ్ గా నారాయణఖేడ్ ను తీర్చిదిద్దుతామన్నారు. ఆదిలాబాద్, పటాన్ చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గం మీదుగా రైల్వే లైన్ ను తీసుకొస్తామన్నారు. లింగాయత్, ఆరె మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చే ప్రక్రియ పూర్తి కావొచ్చిందని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి బీజేపీ రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, దలందరికీ ఇండ్లు కట్టిస్తామన్నారు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు.