ఫైలు కదలాలంటే అధికారులకు పైకం కట్టాల్సిందే

ఫైలు కదలాలంటే అధికారులకు పైకం కట్టాల్సిందే
  • రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదుల వెల్లువ.. నాలుగు నెలల్లో 3,890 కంప్లయింట్లు
  • ప్రైవేటు ఆపరేటర్ల వసూళ్లు.. పై అధికారులకు పంపకాలు
  • పేరుకే కొత్త విధానం.. రైతుల ఇబ్బందులపై చర్యలు శూన్యం

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌లో లంచాలపై సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీఎస్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు, సీసీఎల్‌‌‌‌‌‌‌‌ఏకు, కలెక్టరేట్ కార్యాలయాలకు మండల ఆఫీసర్ల ముడుపుల వ్యవహారంపై వేల సంఖ్యలో కంప్లయింట్లు అందుతున్నాయి. తప్పుల సవరణకు తీసుకువచ్చిన మాడ్యుల్స్‌‌‌‌‌‌‌‌ను కూడా కొందరు అధికారులు కాసుల కోసం వాడుకుంటున్నారు. తప్పులకు సరి చేసుకునేందుకు అప్పటికే మీ సేవలో సర్వీస్ చార్జీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పైకం కడుతున్న రైతులు.. పని పూర్తి చేసుకునేందుకు అధికారులకు లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. లేదంటే దరఖాస్తు చేసుకున్న ఫైల్ రిజెక్ట్ అవ్వడమో, రోజుల తరబడి పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టడం వంటివి చేస్తున్నారు. ఏమైందని ధరణి బాధితులు సదరు ఆఫీసర్ల దగ్గరకు వెళితే రేపు, మాపు అంటూ తిప్పించుకుంటున్నారు. గత 4 నెలల్లో ఉన్నతాధికారుల దృష్టికి ఇలాంటి ఫిర్యాదుల సంఖ్య 3,890కి పెరిగింది. జిల్లా కలెక్టరేట్లలో ముడుపుల పిర్యాదులను పరిగనణలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఇంకా పెరిగే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. ధరణి పోర్టల్ ప్రారంభించిన సమయంలో, ఇకపై ఎలాంటి లంచాలు ఉండవని, క్షణాల్లో పని పూర్తవుతుందని చెప్పిన సీఎం కేసీఆర్ మాటలు అబద్ధామయ్యాయని రైతులు అంటున్నారు. ఇంతకుముందు లాగే పైసలు ఇస్తేనే పని అవుతుందని వాపోతున్నారు. అప్పుడు వీఆర్వోలు తీసుకుంటే, ఇప్పుడు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐలు, సీనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లకు, ధరణి ఆపరేటర్లకు లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తుదని చెబుతున్నారు.

చార్జీలతో పాటు లంచాలు.. 

ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలు, మిస్సింగ్ సర్వే నంబర్లు, సర్కార్ భూములుగా నమోదైన పట్టా భూములు, మ్యుటేషన్లు, విలేజ్ ఖాతాలోకి పట్టా భూములు, సక్సెషన్ల అప్లికేషన్లు, విస్తీర్ణం తక్కువగా నమోదైన భూములు తదితరాలకు సంబంధించిన వివరాలు ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌లో తప్పుగా రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. రైతులకు, పట్టాదారులకు ఎలాంటి సంబంధం లేకుండానే ఈ కొత్త సమస్యలు వచ్చాయి. వీటిని సరి చేసుకునేందుకే ప్రభుత్వం మాడ్యూల్స్‌‌‌‌‌‌‌‌ తీసుకువచ్చింది. ఇందులో దరఖాస్తు చేసుకునేందుకు సర్వీస్ చార్జీలు వసూలు చేయడంతో పాటు ప్రభుత్వం ఫీజును కూడా తీసుకుంటున్నది. ఒక్క మ్యుటేషన్​ కోసమే ఎకరాకు రూ.2,500 చొప్పున చార్జ్ వసూలు చేస్తోంది. ఇలా మాడ్యూల్స్‌‌‌‌‌‌‌‌లో దేనికైనా దరఖాస్తు చేసుకుంటే, ఫీజులతో పాటు లంచాలు ఇచ్చుకుంటేనే ఫైల్‌‌‌‌‌‌‌‌ కదుతున్నది. మాడ్యూల్స్‌‌‌‌‌‌‌‌లో​పెట్టిన అప్లికేషన్లకే కాకుండా క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లకు కూడా ముడుపులు చెల్లించుకోవాల్సి వస్తున్నది. అగ్రికల్చర్ భూములకు స్లాట్ బుక్​ చేసుకున్న దాని ప్రకారం ప్రతి రోజు ఏ సమయానికి ఎవరెవరి రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ధరణి ఆపరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెలిసిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకాక ముందే వారితో సంప్రదింపులు జరిపి, ఎకరాకు రూ.3 వేల దాకా వసూలు చేస్తున్నరు. ధరణి ఆపరేటర్లుగా ప్రైవేట్ వ్యక్తులు ఉండటంతో వాళ్లే వసూలు చేసి పై అధికారులకు పంచుతున్నారు.

నెలకు వెయ్యి ఫిర్యాదులు..

ధరణిలో తమ సమస్యల పరిష్కారానికి డబ్బులు అడుగుతున్నారంటూ బాధితులు సీఎస్ సోమేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మెయిల్స్, వినతుల రూపంలో ఫిర్యాదులు చేస్తున్నారు. సీసీఎల్‌‌‌‌‌‌‌‌ఏకు కూడా వందల్లో కంప్లయింట్లు వస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు లంచాలకు సంబంధించి 3,890 ఫిర్యాదులు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. అంటే యావరేజ్‌‌‌‌‌‌‌‌గా నెలకు వెయ్యి మంది ఫిర్యాదులు వస్తున్నట్లు అంచనా. మరికొంత మంది విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కూడా కంప్లయింట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇన్నీ ఫిర్యాదులు వస్తున్నా సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మాడ్యుల్‌‌‌‌‌‌‌‌లో ఒక్క అప్లికేషన్ ప్రాసెస్ చేసి అప్రూవల్ చేయించేందుకు రూ.6 వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటున్నారు. ఇలా 33 మాడ్యుల్స్‌‌‌‌‌‌‌‌లో ప్రతి అప్లికేషన్‌‌‌‌‌‌‌‌కు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని డాక్యుమెంట్లు సరిగానే ఉన్నాయని, పైసలెందుకని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ఫైల్‌‌‌‌‌‌‌‌ రిజెక్ట్ చేయడమో లేదా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టడమో చేస్తున్నారని రైతులు తమ ఫిర్యాదులో పేర్కొంటున్నట్లు సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో ఉన్నతాధికారి ఒకరు వివరించారు.