సపోర్ట్ చేస్తలే.. ప్రచారానికి పోతలే! .. శేరిలింగంపల్లి బీజేపీలో వర్గపోరు

సపోర్ట్ చేస్తలే.. ప్రచారానికి పోతలే! .. శేరిలింగంపల్లి బీజేపీలో వర్గపోరు

గచ్చిబౌలి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి సెగ్మెంట్​లో బీఆర్ఎస్​, కాంగ్రెస్ ​అభ్యర్థుల మధ్యే పోటీ  హోరాహోరీగా ఉంది. ఇద్దరూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే.. బీజేపీ క్యాండిడేట్ పోటీ ఇవ్వగలడా.. అనే చర్చ సొంత పార్టీ కార్యకర్తలు, నేతల మధ్యనే జరుగుతోంది. పార్టీ అభ్యర్థికి లీడర్లు, కార్యకర్తలు కూడా సపోర్ట్​ చేయడం లేదు. టికెట్​ఆశించిన లీడర్లు, కార్యకర్తలు మౌనంగా ఉండిపోయారు. ప్రచారానికి అభ్యర్థి వెంట కూడా వెళ్లడం లేదు. పార్టీలో ప్రధాన లీడర్​ఒకటి, రెండు రోజుల్లో బీజేపీని వీడి కాంగ్రెస్​లో చేరేందుకు రెడీ అవుతుండగా.. కమలం నేతల తీరుతో అభ్యర్థి తీవ్ర ఆందోళనలో పడిపోయాడు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్​ మధ్యే ప్రధాన పోటీ.. 

ఇక్కడ బీఆర్ఎస్​ నుంచి ఆరెకపూడి గాంధీ బరిలో ఉండగా.. హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రచారంలో  దూసుకెళ్తున్నాడు. బీఆర్ఎస్​ మాదాపూర్ ​కార్పొరేటర్, జీహెచ్ఎంసీ ఫ్లోర్​లీడర్​ వి. జగదీశ్వర్​గౌడ్​కొద్దిరోజుల కిందట కాంగ్రెస్​​లో చేరి టికెట్ తెచ్చుకుని పోటీలో నిలిచారు. అంతకుముందే ఆయన నియోజకవర్గంలో కాలనీల అసోసియేషన్లు, సామాజిక వర్గాల లీడర్లు, గేటెడ్​కమ్యూనిటీ అసోసియేషన్లను  కలిసి గ్రౌండ్​వర్క్​చేసుకొని మద్దతు పొంది కాంగ్రెస్​లో చేరారు. 

మరోవైపు టికెట్​ఆశించి దక్కని లీడర్లను కలిసి మద్దతు కోరుతున్నాడు. జగదీశ్వర్​గౌడ్​ సొంతూరు నల్లగండ్ల కావడంతో పాటు హఫీజ్​పేట, మాదాపూర్ డివిజన్లకు భార్యభర్తలు కార్పొరేటర్లుగా ఉండడం కలిసివచ్చింది. దీంతో పాటు పాత కాంగ్రెస్ ​నేతలను, కార్యకర్తలను కలుపుకొని పోతూ అధికార బీఆర్ఎస్​అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తున్నారు. బీజేపీ నుంచి మారబోయిన రవికుమార్​యాదవ్​ పోటీలో ఉండగా.. టికెట్​ఆశించి భంగపడిన లీడర్లు ఆయనకు సపోర్ట్​ చేయడం లేదు. వారిని కలిసి మద్దతు కోరేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడంతో గందరగోళం నెలకొంది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసిరాకపోతుండగా కమలం పార్టీ అభ్యర్థికి ఎదురుదెబ్బ తగిలింది. 

 నామినేషన్​కు ఒక్కరోజు ముందు..

నామినేషన్​కు ఒక్క రోజు ముందు టికెట్​దక్కించుకున్న రవికుమార్ ​యాదవ్​కు ఆ పార్టీ నుంచి టికెట్​ఆశించి దక్కని గజ్జల యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, కొరదల నరేశ్​తో పాటు వారి అనుచరులు, క్యాడర్ కూడా సపోర్ట్ ​చేయడం లేదు. వారిని కలిసి సహకరించాలని కోరేందుకు వెళ్లినా రవికుమార్ ​యాదవ్​కు నిరాశే ఎదురైంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్​అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంటే.. బీజేపీ అభ్యర్థి మాత్రం నేతలను, కార్యకర్తలను సముదాయించి ప్రచారానికి ఒప్పించే పనిలో ఉన్నాడు. 

ఒంటెత్తు పోకడల కారణంగా.. 

బీజేపీ అభ్యర్థి రవికుమార్​ యాదవ్ ​ఒంటెత్తు పోకడల కారణంగానే ఆ పార్టీ లీడర్లు, క్యాడర్ అతడికి అంటిముట్టనట్లు ఉంటున్నారు. దీంతో ఆయా లీడర్ల సామాజిక వర్గాల ఓట్లు బీఆర్ఎస్​, కాంగ్రెస్​కు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కొరదల నరేశ్​ సామాజిక వర్గానికి చెందిన దాదాపు 80 వేల ఓట్లు, యోగానంద్ ​సామాజిక వర్గానికి చెందిన 60వేల ఓట్లతో పాటు వారి ప్రభావం ఉండే ఇతర సామాజికవర్గాలు, కాలనీలు, అసోసియేషన్లు, గేటెడ్​కమ్యూనిటీల ఓట్లు మొత్తం బీజేపీకి దూరమయ్యేలా చాన్స్ ఎక్కువగా ఉంది. ఇదే జరిగితే శేరిలింగంపల్లిలో గెలవాల్సిన సీటును చేజార్చుకునే పరిస్థితి తలెత్తే అవకాశముంది. బీజేపీ మూడో ప్లేస్​కే పరిమితం కావాల్సి వస్తుంది. 

కాంగ్రెస్​లోకి మొవ్వ సత్యనారాయణ?

తనపై దాడి చేయించిన నాయకుడికి బీజేపీ టికెట్​ఇవ్వడంతో.. శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ  లీడర్ ​మొవ్వ సత్యనారాయణ అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు. రవికుమార్​కు సపోర్ట్​ చేసేందుకు కూడా అంగీకరించడం లేదు. పార్టీ మారేందుకు తన అనుచరులు, కార్యకర్తలతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే శేరిలింగంపల్లిలో బీజేపీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది.

ALSO READ: శంషాబాద్ ఎయిర్​పోర్టులో .. 1.8 కిలోల గోల్డ్ సీజ్

సొంత పార్టీ లీడర్లపైనే దాడులు 

 బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్​ గతంలో సొంత పార్టీ లీడర్లపైనే తనవర్గం కార్పొరేటర్​అనుచరులతో దాడి చేయించాడు. దీంతో సెగ్మెంట్​లో బీజేపీలో నేతల మధ్య తీవ్ర వైరం ఏర్పడింది. పంచాయితీ పోలీస్​స్టేషన్​కు కూడా చేరింది. దీంతో రవికుమార్​యాదవ్​, గజ్జల యోగానంద్ ​ఎవరికి వారే సెగ్మెంట్ లో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు.