స్మార్ట్​ సిటీ కరీంనగర్​లో  కాలేజీ గ్రౌండ్లు ఖల్లాస్

స్మార్ట్​ సిటీ కరీంనగర్​లో  కాలేజీ గ్రౌండ్లు ఖల్లాస్

 స్టూడెంట్లకు ప్లే గ్రౌండ్స్, మున్ముందు ​అవసరాలకు జాగా​ కరువు
ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు
ఎస్ఆర్ఆర్​ కాలేజీ ఎదుట స్టూడెంట్ల ఆందోళన

కరీంనగర్/కరీంనగర్​సిటీ, వెలుగు: స్మార్ట్​ సిటీ కరీంనగర్​లో మొన్నటికి మొన్న ఆర్ట్స్ కాలేజీ ఆవరణను పార్కుగా మార్చిన ఆఫీసర్లు, తాజాగా చారిత్రక ఎస్ఆర్ఆర్ ​డిగ్రీ కాలేజీ ఆవరణలో కళాభారతి కడుతుండడం  వివాదాస్పదమవుతోంది.  ఈ రెండు చోట్లా కాలేజీ గ్రౌండ్లకే ఎసరు పెట్టడంపై స్టూడెంట్ ​యూనియన్లు భగ్గుమంటున్నాయి. ఇప్పుడు గ్రౌండ్లు ఖాళీగా కనిపిస్తున్నాయని పార్కులు, కళాభారతిలు కట్టేస్తే రేపు స్టూడెంట్స్ వచ్చాక వాళ్ల ఆటపాటల సంగతేంటి అని యూనియన్​ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్​లో ఒకవేళ కాలేజీలను విస్తరించాల్సి వస్తే అప్పుడు స్థలం ఎక్కడి నుంచి తెస్తారని నిలదీస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు కాలేజీల్లోని ఖాళీ జాగాలను పలు 
నిర్మాణాలతో నింపేసిన ఆఫీసర్లు  తాజాగా గ్రౌండ్లను కూడా వదలకపోవడంపై మండిపడుతున్నారు.
కాలేజీ గ్రౌండ్​కు ఎసరు
స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ లో భాగంగా కరీంనగర్​ నడిబొడ్డున ఉన్న సర్కస్ గ్రౌండ్.. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లను ఇప్పటికే పార్కులుగా మారుస్తున్నారు. ఇక ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసిన ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్​లో ఏకంగా  కళాభారతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఎస్​ఆర్​ఆర్​ కాలేజీలో స్టూడెంట్స్ కు సరిపడా తరగతి గదులు, ప్లే గ్రౌండ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో కాలేజీ ఆవరణలో ఏకంగా కళాభారతి  కట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారం కింద ఎస్ఆర్ఆర్ కాలేజీలో కళాభారతి నిర్మాణాన్ని పరిశీలించడానికి మంత్రితోపాటు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ వెళ్లారు. వీరికి అక్కడ  కాలేజీ  స్టూడెంట్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ‘ఇక్కడ కళాభారతి కట్టవద్దు. ఇప్పటికే కాలేజీ గ్రౌండ్​ను వివిధ నిర్మాణాలకు వాడారు. మళ్లీ నిర్మాణాలు చేస్తే ఆటలకు, కాలేజీ  భవిష్యత్​ అవసరాలకు కష్టం’ అని అడ్డుచెప్పారు. దీంతో సహనం కోల్పోయిన మంత్రి ఆ స్టూడెంట్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ‘వాళ్లను ఇక్కడి నుంచి లాక్కెళ్లి రెండు తగిలించండి’ అంటూ మాట్లాడారు. ప్రస్తుత కళాభారతి బస్​స్టేషన్​ ఎదురుగా అందరికీ అందుబాటులో ఉంది. ఏ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకైనా అది అనువుగా ఉంది. అది మున్సిపల్​ స్థలమే కావడంతో ఇంకొంచెం జాగ కేటాయించి,  పెద్దగా నిర్మిస్తే సరిపోతుంది. కానీ బస్​స్టేషన్​కు మూడు కిలోమీటర్ల దూరంలోని  ఎస్ఆర్ఆర్‌ కాలేజీ దగ్గర ప్రస్తుతం నిర్మిస్తున్న కళాభారతి వల్ల ఎవరికీ  పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే నగరంలో ఉన్న రెండు గ్రౌండ్లను క్రీడాకారులకు, స్టూడెంట్స్​కు కాకుండా చేశారు. ఇక  మిగిలిన ఒక్క  ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్​లో ఇప్పుడు ఇలా కళాభారతి కడుతున్నారని స్టూడెంట్​యూనియన్ ​నాయకులు ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ  అక్కడ  నిర్మాణాన్ని విరమించుకోవాలని డిమాండ్ ​చేస్తున్నారు. 
ఆటలకు చోటేది? 
కరీంనగర్ లాంటి సిటీలో వాకింగ్ చేయడానికి సరైన గ్రౌండ్​ లేదు. ఉన్న ఒక్క అంబేద్కర్​  స్టేడియం లోపలి భాగంలో ఏడాదిన్నర కాలంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. దీంతో  స్టేడియం చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్.. లోపల ఉన్న బాస్కెట్ బాల్ కోర్టులను తొలగించారు. దీంతో క్రీడాకారులకు, వాకర్స్​కు ఇబ్బందిగా మారింది. ఇక ముకరంపుర, భగత్ నగర్, కోతి రాంపూర్, గణేశ్ నగర్,  కట్టా రాంపూర్ ఏరియాల్లో ఉన్న జనం వాకింగ్ చేయడానికి గ్రౌండ్​ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదివరకు గీతాభవన్ ఏరియాలో ఉన్న సర్కస్ గ్రౌండ్, మల్టీపర్పస్ స్కూల్ గ్రౌండ్ (ఈ రెండు కూడా ఆర్ట్స్​ కాలేజీలో భాగం)లో  యూత్, పిల్లలు క్రికెట్, షటిల్​లాంటి ఆటలు ఆడుకునేవారు. వాకింగ్​, సైక్లింగ్​ చేసేవాళ్లు. కానీ సర్కస్ గ్రౌండ్ ను ఇప్పుడు పార్క్ గా మార్చేశారు. ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినా.. ఎంట్రీ టికెట్ పెట్టడంతో చాలామంది వాకర్స్ ఇందులోకి రావడానికి ఇంట్రెస్ట్​ చూపడం లేదు. తీరా ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీ ని కూడా పార్కుగా మారుస్తున్నారు.  దీంతో ఈ రెండు గ్రౌండ్స్​లో ఆటపాటలకు వీల్లేకుండా పోయింది. మల్టీ పర్పస్​ స్కూల్, కాలేజీ పిల్లలకు స్పోర్ట్స్​ ఎక్కడ ప్రాక్టీస్​ చేయిస్తారనేది అంతుచిక్కడం లేదు.
కళాభారతి వద్దు.. హాస్టల్ ముద్దు
ఎస్ఎఫ్ఐ, ఎస్ఆర్ఆర్ కాలేజీ కమిటీ ఆధ్వర్యంలో ‘కళాభారతి వద్దు.. హాస్టల్ ముద్దు’ నినాదంతో  బుధవారం కాలేజీ మెయిన్ గేట్ వద్ద నిరసన తెలిపారు. ఇప్పటికే  నగరం నడిబొడ్డున ఉన్న ఆర్ట్స్ కాలేజీని స్మార్ట్ సిటీ అభివృద్ధి పేరుతో కూల్చివేశారని, ఇప్పుడు ఎస్‍ఆర్‍ఆర్‍ కాలేజీ ప్రాంగణంలో కళాభారతి నిర్మించడం పేదలకు విద్యను దూరం చేయడమేనన్నారు. జిల్లా కేంద్రంలో  దాదాపు 15 ప్రభుత్వ కాలేజీ హాస్టల్స్​అద్దె భవనాల్లో ఇరుకు గదుల మధ్య కొనసాగుతున్నా బీసీ సంక్షేమ మంత్రి కమలాకర్‍కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాలేజీ భూములు కాపాడేందుకు జిల్లా కలెక్టర్‍ చర్యలు చేపట్టాలని డిమాండ్‍ చేశారు. కార్యక్రమంలో కాలేజీ కార్యదర్శి అరవింద్, అధ్యక్షులు పంజాల అవినాశ్​గౌడ్, సహాయ కార్యదర్శులు తిప్పారం రోహిత్, పురుషోత్తం, నవీన్, సంధ్య, కోశాధికారి రత్నం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 
గ్రౌండ్​ అంతా తవ్వేసిన్రు
కరీంనగర్ ఆర్ట్స్​కాలేజీలో పార్కు నిర్మిస్తామని అక్కడి కాలేజీ బిల్డింగ్ కూల్చివేశారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ కాలేజీలో ప్రస్తుతం 200 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. పనుల పేరుతో గ్రౌండ్ మొత్తం ఎక్కడికక్కడ తవ్వి వదిలేశారు. పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న కొన్ని గదుల్లో ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తున్నారు. ఎటువంటి సౌకర్యాలు లేని ఇరుకైన గదులతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.