ఓట్ చోరీ ఇలాగే కొనసాగితే.. ఇండియాలోనూ నేపాల్ పరిస్థితి తప్పదు: అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

ఓట్ చోరీ ఇలాగే కొనసాగితే.. ఇండియాలోనూ నేపాల్ పరిస్థితి తప్పదు: అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

లక్నో: దేశంలో సోషల్ మీడియా బ్యాన్, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ జెన్ జెడ్ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. యువత నిరసనల దెబ్బకు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ క్రమంలో నేపాల్ పరిస్థితులను ప్రస్తావిస్తూ కేంద్రంలోని మోడీ సర్కార్‎ను హెచ్చరించారు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. శుక్రవారం (సెప్టెంబర్ 12) లక్నోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఓటు చోరీ విషయంలో ఎన్నికల సంఘం సహాయం చేస్తోందని ఆరోపించారు. 

దేశంలో ఓట్ చోరీ ఇలాగే కొనసాగితే ఇండియాలో కూడా నేపాల్‎లో తలెత్తిన పరిస్థితులు రావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా ఓటు దొంగిలించబడకుండా చూసుకోవడం ఎన్నికల కమిషన్ బాధ్యతని ఈసీకి గుర్తు చేశారు. ఓట్ల దొంగతనం ద్వారా ఎన్నికల్లో గెలవలేనప్పుడు తుపాకులు ఉపయోగించిందని బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాంపూర్, మీరాపూర్ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు చోరీకి పాల్పడిందని ఆరోపించారు. 

►ALSO READ | వీడిన సస్పెన్స్.. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి

అలాగే.. భారతదేశ విదేశాంగ విధానం విఫలమైందని.. ప్రభుత్వం తన పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇదిలా ఉంటే.. ఈ మీడియా సమావేశంలో అఖిలేష్ సిక్కు తలపాగా ధరించి కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సిక్కు సమాజానికి తగిన గౌరవం దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు.