వీడిన సస్పెన్స్.. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి

వీడిన సస్పెన్స్.. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి

ఖాట్మండు: నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2025, సెప్టెంబర్ 12 రాత్రి ఆమె తాత్కలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జెన్ జెడ్ నిరసనకారులు నేపాల్ సైన్యం, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్‌తో జరిపిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరడంతో తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి పేరు ఖరారైంది. అనంతరం నేపాల్ పార్లమెంట్‎ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్‌. సుశీలా కర్కి గతంలో నేపాల్ తొలి మహిళ సీజేగా పని చేశారు. 

►ALSO READ |నా ఫ్రెండ్ చార్లీ కిర్క్‎ను కాల్చి చంపిన హంతకుడు దొరికాడు: ట్రంప్

దేశంలో  సోషల్ మీడియాపై నిషేధం, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ జెన్ జెడ్ యువత కదం తొక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. యువత నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఉద్యమాన్ని అణివేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులు కాల్పుల్లో దాదాపు 20 మంది ఆందోళనకారులు మృతి చెందారు. దీంతో మరింత రెచ్చిపోయిన యువత ప్రధాని, మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేశారు. 

మంత్రులను రోడ్లపై ఉరికించి కొట్టారు. యువత ఆందోళనలకు తలొగ్గి ప్రధాని కేపీ శర్మ ఓలీతో పాటు ఆయన కేబినెట్‎లోని పలువురు మంత్రులు రాజీనామా చేశారు. ఈ పరిణామంతో నేపాల్‎లో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో తాత్కాలిక ప్రధాని ఎంపికపై నేపాల్ ఆర్మీ, అధ్యక్షుడు, జెన్ జెడ్ నిరసనకారులు తీవ్రంగా చర్చలు జరిపారు. జెన్ జెడ్ ఉద్యమకారులు సుశీలా కర్కి పేరును ప్రతిపాదించారు. 

ఇదే సమయంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. సుశీలా కర్కి, బాలెన్ షా, ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ సీఈవో కుల్మాన్​ ఘీసింగ్ పేర్లు ప్రధానంగా వినిపించాయి. సుశీలా కర్కి, కుల్మాన్​ ఘీసింగ్ విషయంలో జెన్ జెడ్ నిరసనకారులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇందులో కొందరు సుశీలాకు మద్దతుగా నిలిస్తే.. ఇంకొందరు కుల్మాన్​ ఘీసింగ్‏కి సపోర్ట్ చేశారు. 

దీంతో తాత్కాలిక ప్రధాని ఎంపికపై పీఠముడి పడింది. చివరకు ఆర్మీ, అధ్యక్షుడు, జెన్ జెడ్ నిరసనకారుల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో సుశీలా కర్కి పేరును తాత్కాలిక ప్రధానిగా ఖరారు చేశారు. సుశీలా కర్కి శుక్రవారం (సెప్టెంబర్ 12) రాత్రి 9 గంటలకు తాత్కాలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేపాల్ లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సుశీలా కర్కి ఏ విధంగా ముందుకు పోతారనేది ఆసక్తికరంగా మారింది.