
ఈ మద్య క్రిప్టో కరెన్సీ పేరుతో జరుగుతోన్న మోసాలు ఎక్కువవుతున్నాయి. పెట్టిన పెట్టుబడికి రెండింతలిస్తాం..మూడింతలిస్తామని చెప్పి ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేసుకుంటారు. తర్వాత ప్రతి నెలకు అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని కొన్ని రోజులు డబ్బులు ఇస్తూ నమ్మిస్తారు...తర్వాత మెల్లిమెల్లిగా ముఖం చాటేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు,సామాన్యులు లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు.
లేటెస్ట్ నకిలీ క్రిప్టో కరెన్సీ కేసులో కరీంనగర్ మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ ను అరెస్టు చేశారు కరీంనగర్ రూరల్ పోలీసులు . మెటా ఫండ్ క్రిప్టో స్కీమ్ పేరుతో మూడింతలు లాభాలు వస్తాయని ప్రజలను నమ్మబలికినట్లు సతీష్ పై అభియోగాలు ఉన్నాయి. ఫిర్యాదు దారు నున్సావత్ భాస్కర్ నుంచి రూ.15 లక్షలు వసూలు చేశాడు సతీష్.. ఇలా లాభాలు వస్తాయని నమ్మించి మరో 17 మందిని స్కీమ్‌లో చేర్పించి మొత్తం రూ. 1.20 కోట్లు వసూలు చేశాడు.
►ALSO READ | ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..మంచిర్యాలకు చెందిన మావోయిస్టు మృతి
మూడు నెలల్లో మూడింతలు లాభాలు ఇస్తానని హామీ ఇచ్చి డబ్బులు ఎగ్గొట్టినట్లు బాధితుల ఫిర్యాదు చేశారు. బాధితులు డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో తెలిపారు . బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మాజీ కార్పొరేటర్ సతీష్ ను అరెస్ట్ చేశారు.అతడి దగ్గర నుంచి ఐపాడ్, రెండు మొబైల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు పోలీసులు.