గురువారం చతికిలపడ్డ స్టాక్ మార్కెట్లు.. నష్టాలకు కారణం ఏంటంటే..?

గురువారం చతికిలపడ్డ స్టాక్ మార్కెట్లు.. నష్టాలకు కారణం ఏంటంటే..?

అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ ప్రకటన తర్వాత భారీ ర్యాలీని చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మళ్లీ చతికిలపడ్డాయి. ప్రధానంగా నేడు మెటల్, ఆటో స్టాక్స్ భారీగా నష్టపోవటంతో పాటు ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11.10 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 336 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 116 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 175 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 456 పాయింట్ల మేర పతనంతో ముందుకు సాగుతున్నాయి.

వరుసగా మూడు రోజుల పాటు కొనసాగిన బుల్ ర్యాలీ అమ్మకాల ఒత్తిడితో నేడు కనుమరుగైంది. ఇన్వెస్టర్లు లాభాల బుక్కింగ్ కోసం ఎగబడటంతో దానికి ప్రతికూల మార్కెట్ ట్రెండ్ తోడై కీలక సూచీల నష్టాల్లోకి జారుకున్నాయని నిపుణులు అంటున్నారు. ఇవాళ ఫిబ్రవరి 5న మార్కెట్లను ప్రభావితం చేసిన కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మెటల్ ప్రాఫిట్ బుకింగ్ సెగ: 
గడిచిన మూడు సెషన్లలో సుమారు 6 శాతం మేర లాభపడిన మెటల్ రంగ షేర్లు నేడు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా మెటల్ ధరలు తగ్గడంతో.. ఈ రంగానికి చెందిన సూచీ దాదాపు 2 శాతం నష్టపోయింది. దీనికి తోడు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న సానుకూలతతో గత కొన్ని రోజులుగా లాభపడిన మార్కెట్లలో మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. ఇదిలా ఉంటే.. గత సెషన్‌లో ఏఐ ఆందోళనలతో కుప్పకూలిన ఐటీ రంగం స్వల్పంగా కోలుకోవడం ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

ఎఫ్‌ఐఐల మందగింపు: 
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి 3 శాతానికి పైగా పడిపోగా.. నిక్కీ, షాంఘై సూచీలు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. అమెరికా మార్కెట్లు కూడా బుధవారం బలహీనంగా ముగియడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(FII) బుధవారం కేవలం రూ.29.79 కోట్ల విలువైన షేర్లను మాత్రమే కొనుగోలు చేశారు. మంగళవారం నాటి భారీ కొనుగోళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

ఆర్బీఐ పాలసీ:
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ నిర్ణయాలు శుక్రవారం వెలువడనున్నాయి. వడ్డీ రేట్ల విషయంలో యథాతథ స్థితి కొనసాగవచ్చని అంచనాలు ఉన్నప్పటికీ.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. నేడు సెన్సెక్స్ డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ కావడంతో మార్కెట్లో అస్థిరత పెరిగింది. ఇండియా విక్స్ 12.28 వద్ద ట్రేడవుతుండటం ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాన్ని సూచిస్తోంది.