శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధికార పార్టీ నేతల వర్గపోరు

శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధికార పార్టీ నేతల వర్గపోరు
  • అభివృద్ధి పనులపై చర్చలు లేవ్​..  అడిగితే సప్పడు లేదు
  • మేయర్, డిప్యూటీ మేయర్ల మధ్య  అంతర్గత విబేధాలు
  • మంత్రులు, ఎమ్మెల్యేలు సర్దిచెప్తున్నా మారని పరిస్థితి

హైదరాబాద్​, వెలుగు: శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారింది.  మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల మధ్య వార్  నడుస్తోంది. ఒకరిపై ఒకరు  చేసుకుంటున్న ఆరోపణలతో...  అసలైన సమస్యలు చర్చకు రావట్లేదు.  శివారు ప్రాంతాల్లో 7 కార్పొరేషన్లు, 23 మున్సిపాలిటీలున్నాయి. జనరల్ బాడీ మీటింగ్ లో నామ్ కే వాస్తే గా చర్చలు జరుగుతున్నాయి.  లోకల్ లీడర్ల  పంచాయితీలు మంత్రుల దాకా పోతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు  కల్పించుకొని బుజ్జగిస్తున్నా.. ఫలితం కనిపిస్తలేదు.  బోడుప్పల్​ కార్పొరేషన్​లో ఇటీవల జరిగిన జనరల్​ బాడీ మీటింగ్ ను డిప్యూటీ మేయర్ వాకౌట్​ చేశారు.  బండ్లగూడ జాగీర్​ కార్పొరేషన్ లోనూ మొన్నటి వరకు మేయర్, డిప్యూటీ మేయర్ మధ్య వార్ కొనసాగింది. మేయర్ అక్రమాలకు పాల్పడుతున్నడని  డిప్యూటీ మేయర్ సహా పలువురు టీఆర్ఎస్  కార్పొరేటర్లు  కలెక్టర్ కి కంప్లయింట్ చేశారు. తూంకుంట మున్సిపాలిటీతో పాటు మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ నాయకుల మధ్య గ్రూప్ వార్ కొనసాగుతోంది.

జనాన్ని పట్టించుకుంటలే.. 

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, మున్సిపల్ సభ్యులు లోకల్ పంచాయితీల్లో బిజీ కావడంతో సమస్యల్ని పట్టించుకునే వారే లేరని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏరియాల్లో పెండింగ్​ సమస్యలు పెరుగుతున్నాయని.. అభివృద్ధి పనులు జరగట్లేదంటున్నారు. కొన్ని ఏరియాల్లో  నేటికీ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ లాంటి   సౌకర్యాలు లేవనీ,  చిన్న సమస్యలకు కూడా పరిష్కారం చూపడంలేదనీ ఆవేదన చెందుతున్నారు. సమ్మర్ సీజన్ వస్తున్నా  నీటి సమస్యపై నాయకులు పోకస్ పెట్టడం లేదంటున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి రెండేళ్లు పూర్తయినా ఎక్కడా చెప్పుకోదగ్గర అభివృద్ధి పనులు జరగలేదని ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని జనం చెప్తున్నారు.

అధికారులదీ అదే తీరు..

పాలకులు పట్టించుకోకపోయిన అధికారులైనా సమస్యలను పట్టించుకుంటారేమో అనుకుంటే  అదీ లేదు.  కాలనీల్లో సమస్యలు ఉన్నాయని వినతి పత్రాలు ఇచ్చినా ఎవరూ  స్పందించడం లేదని స్థానిక జనం చెప్తున్నారు. పాలకులు చెప్పినట్లుగా పనిచేస్తున్నారే తప్ప వ్యక్తిగతంగా అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం స్ట్రీట్​ లైట్లు కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.     సమస్యలపై ఆయా జిల్లాల కలెక్టర్లకు లెటర్లు రాసేందుకు జనం సిద్ధమవుతున్నారు.

 ఆరోపణలు చేసుకుంటూ పనులను మరిచిన్రు

అభివృద్ధి  పనులు చేయకుండా అధికార పార్టీ నేతలే  ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పనులు చేయడంలేదు. మేయర్, డిప్యూటీ మేయర్  లే గొడవ పడితే పాలకమండలి ఎలా నడుస్తుంది?  ఇట్లైతే జనాలకు ఏం న్యాయం చేస్తారు.  పంచాయితీలు ఆపి పనులు చేయాలె. 

 - లక్ష్మీ వీరమల్లు, సామాజిక కార్యకర్త , బోడుప్పల్

అభివృద్ధికి సహకరించట్లే....

బోడుప్పల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలతో పాటు, బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ హద్దులు నిర్ణయించాలని ఎన్నోసార్లు కలెక్టర్ కు  కంప్లయింట్ చేశా. కార్పొరేషన్ లో జరుగుతున్న ఆక్రమాల వల్ల  చెడ్డ పేరు రావొద్దని  కమిషనర్ కు సూచనలు చేసినా పట్టించుకోకపోవడంతో కలెక్టర్ కు కంప్లయింట్ చేయాల్సి వచ్చింది. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే వారు నాపై నిందలు వేసి జనరల్ బాడీ మీటింగ్ ను వాకౌట్ చేశారు. దీనిపై ఎటువంటి విచారణకైనా నేను సిద్ధమే.

- సామల బుచ్చిరెడ్డి, మేయర్, బోడుప్పల్ కార్పొరేషన్