
హైదరాబాద్, వెలుగు : గత వానాకాలంలో రికార్డు స్థాయిలో వరి సాగై భారీగా దిగుబడి వచ్చినా.. వడ్ల కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ 3 నెలల్లో 65.02 లక్షల టన్నుల వడ్లనే కొనింది. 2021లో 62.15 లక్షల ఎకరాల్లో వరి సాగైతే 70.46 లక్షల టన్నులు కొనుగోళ్లు చేయగా.. ఈయేడు దాదాపు రెండున్నర లక్షల ఎకరాలు ఎక్కువ సాగైనా 5 లక్షల టన్నుల వడ్లు తక్కువ కొనుగోలు చేసింది. సర్కారు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, కొనుగోళ్లలో జాప్యం కారణంగా ప్రైవేటు వ్యాపారులకు అగ్గువకే రైతులు పంట అమ్ముకున్నారు.
రెండున్నర లక్షల టన్నులు పెరిగినా..
గత వానాకాలంలో రాష్ట్రంలో 64.54 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డు. ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల చొప్పున 1.61 కోట్ల టన్నుల దిగుబడి వచ్చిందని అంచనా. రాష్ట్ర అవసరాలు, వ్యాపారుల కొనుగోళ్లు పోగా.. రైతుల నుంచి 1.12 కోట్ల టన్నుల వడ్లు కొనాలని సివిల్ సప్లయ్స్ శాఖ టార్గెట్గా పెట్టుకుంది. అక్టోబర్ 22 నుంచి వడ్ల కొనుగోళ్లు షురూ చేయగా దాదాపు పది లక్షల మంది రైతుల నుంచి 65.02 లక్షల టన్నుల వడ్లనే కొన్నది. అధికారుల నిర్లక్ష్యం, సెంటర్ల నిర్వాహకుల నిలువుదోపిడీతో రైతులు దాదాపు సగం వడ్లను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. కొందరు రైతులు పొలాల వద్దే కాంటా పెట్టి ప్రైవేటు వ్యాపారులకు అగ్గువకే పంట అమ్ముకుని నష్టపోయారు.