ధరణిలో ప్రొహిబిటేడ్ లిస్టులో 2 లక్షల ఎకరాలు 

ధరణిలో ప్రొహిబిటేడ్ లిస్టులో 2 లక్షల ఎకరాలు 
  •    అమ్ముకోలేక, వారసులకు ఇవ్వలేక బాధితుల ఇబ్బందులు 
  •     ఏపీలో శాశ్వత హక్కులు కల్పిస్తూ సర్కార్ ఉత్తర్వులు 
  •     ఎన్ఓసీలు కూడా అక్కర్లేదని ఆదేశాలు 


హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికులకు అసైన్ చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ ఏపీ ప్రభుత్వం ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. ఈ భూములకు ఏపీ అసైన్‌‌మెంట్‌‌ చట్టం–1977 వర్తించదని స్పష్టం చేసింది. ఎన్ఓసీలు అవసరం లేదని, కలెక్టర్లే నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తీసేయాలని ఆదేశించింది. కానీ మన రాష్ట్రంలో మాత్రం మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులు, వారి వారసులకు సర్కార్ చుక్కలు చూపిస్తోంది. వారికి గత ప్రభుత్వాలు అసైన్ చేసిన దాదాపు 2 లక్షల ఎకరాలను ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌లో నిషేధిత జాబితాలో చేర్చింది. వాటిని ఆ జాబితా నుంచి తీసేయాలని కోరుతూ వారంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రెండేండ్లుగా ఎన్ఓసీలు జారీ చేయడం లేదు. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవోలు, హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదు. నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బాధితులు అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్లు రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో బాధితులు భూములు అమ్ముకోలేక, తమ వారసుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో స్వయంగా కలెక్టర్లే నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తుంటే, మన రాష్ట్రంలోనేమో అప్లికేషన్లు పెట్టుకున్నా వాటిని తిరస్కరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఇదీ హైకోర్టు తీర్పు.. 

2004లో జారీ చేసిన జీఓ 1045 ప్రకారం మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులకు అసైన్‌‌ చేసిన భూములను పదేండ్ల పాటు అమ్మడానికి, కొనడానికి వీల్లేదు. పదేండ్ల తర్వాత క్రయవిక్రయాలకు ఎలాంటి ఎన్‌‌ఓసీలు అవసరం లేదు. కానీ జీవో అమలు కాకపోవడంతో కొందరు మాజీ సైనికులు హైకోర్టును ఆశ్రయించారు. 2012లో వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు మేరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 307 జారీ చేసింది. దీని ప్రకారం ఫ్రీడమ్ ఫైటర్లు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు పదేళ్ల తర్వాత ఎవరికైనా అమ్ముకోవచ్చు, గిఫ్ట్ గా ఇచ్చుకోవచ్చు.  

50 ఏండ్ల తర్వాత నిషేధిత జాబితాలోకి...  

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన ఫ్రీడమ్ ఫైటర్ మన్నె గోపాల్ రెడ్డికి పొలిటికల్ సఫరర్ కేటగిరీలో 1962లో అప్పటి ప్రభుత్వం అదే గ్రామంలోని 86వ సర్వే నెంబర్ లో 10 ఎకరాల భూమి కేటాయించింది. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత ఆయనకు కొత్త పాస్ బుక్‌‌‌‌ ఇచ్చారు. ప్రస్తుతం 94 ఏండ్లున్న గోపాల్ రెడ్డి.. ఇటీవల ఆ భూమిని తన కొడుకుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించేందుకు వెళ్తే నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలిసింది. భూమి ఇచ్చిన 50 ఏండ్ల తర్వాత నిషేధిత జాబితాలో చేర్చడమేమిటని గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మ్యుటేషన్ చేస్తలేరు.. 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 30 ఏండ్లు పని చేశాను. సర్వీసులో ఉండగానే 1995లో అప్పటి ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లిలో మూడెకరాలిచ్చింది. మానసిక సమస్యతో బాధపడుతున్న నా కూతురికి ఆసరాగా ఉంటుందని ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు వెళ్తే, అది నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నట్లు చెప్పారు. తహసీల్దార్, కలెక్టర్ చుట్టూ తిరిగితే చివరకు రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత మ్యుటేషన్ చేసి, పాస్ బుక్ ఇవ్వాలని అప్లికేషన్ పెట్టాను. ఏడాదైనా పాస్‌‌‌‌ బుక్ రాలేదు.  
                                           - గట్ల రాజ్ కుమార్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి 

దేశ సేవ చేస్తే ఇదేనా బహుమతి? 

తెలంగాణ సర్కార్ మాజీ సైనికుల సంక్షేమాన్ని మరిచింది. చాలా మంది మాజీ సైనికులు సొంత ఇండ్లు లేక ఇబ్బందులు పడుతుంటే.. కరీంనగర్ లో మా కోసం కేటాయించిన రాజీవ్ గృహకల్ప ప్లాట్లను ప్రభుత్వం వేలానికి పెట్టింది. అలాగే గత ప్రభుత్వాలు మాజీ సైనికులకు ఇచ్చిన వ్యవసాయ భూములనూ లాక్కుంటోంది. నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోంది. దేశం కోసం పని చేసిన మాకు ఈ ప్రభుత్వమిచ్చే బహుమతి ఇదేనా.  
                                             - రావుల రంగారెడ్డి, కన్వీనర్, మాజీ సైనికుల జేఏసీ