భోలే బాబా ఆస్తి 100 కోట్లు : ముందు 350 బైక్​లు, వెనుక 30 కార్ల కాన్వాయ్

భోలే బాబా ఆస్తి 100 కోట్లు : ముందు 350 బైక్​లు, వెనుక 30 కార్ల కాన్వాయ్
  •     దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు 
  •     ఆశ్రమాల్లో ఫైవ్ స్టార్ సౌలతులు 
  •     సెక్యూరిటీకి వేలాది సేవాదార్లు

న్యూఢిల్లీ: లగ్జరీ కార్లు.. ఫైవ్ స్టార్ హోటళ్లను తలపించే ఆశ్రమాలు.. ఎక్కడికైనా వెళ్తే అతిపెద్ద కాన్వాయ్.. ముంగట 350 బైక్​లు, వెనుక15 నుంచి 30 కార్లు.. పర్సనల్ సెక్యూరిటీగా 16 మంది కమాండోలు.. ఇదీ భోలే బాబా లగ్జరీ లైఫ్. ఆయన ఆస్తుల విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. హత్రాస్ ఘటన నేపథ్యంలో భోలే బాబాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీ నారాయణ్ హరి సాకార్ చారిటబుల్ ట్రస్ట్ తో పాటు మరికొన్ని ట్రస్టుల పేరుతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 24 ఆశ్రమాలు నిర్మించారు. 

ఇందులో బాబా ఉండే ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి ఆశ్రమం 13 ఎకరాల్లో విస్తరించి ఉంది. స్టార్ హోటల్ ను తలపించేలా ఇక్కడ భవనాలు నిర్మించారు. ఆరు రూమ్స్ బాబా, ఆయన భార్య కోసం కేటాయించారు. ఇలాంటి ఆశ్రమాలే యూపీలోని కాసర్ గంజ్, ఆగ్రా, పటియాలీ, కాన్పూర్, మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లోనూ ఉన్నాయి. కాన్పూర్ లోని ఆశ్రమంలో అన్ని రూముల్లోనూ ఏసీ సౌకర్యం, మీటింగ్స్ కోసం పెద్ద సత్సంగ్ భవన్ ఉన్నది. భక్తుల విరాళాలతో ఆశ్రమాలు నిర్మించినట్టు బోర్డులు ఏర్పాటు చేశారు. 

వైట్ అండ్ వైట్ 

భోలే బాబా సెక్యూరిటీని ఆయన భక్తులే చూసుకుంటారు. వీళ్లను సేవాదార్ అంటారు. వీళ్లను ఎంపిక చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సేవాదార్లకు జీతంతో పాటు ఆశ్రమంలో వసతి సౌకర్యం కల్పిస్తారు. ‘‘సెక్యూరిటీ పరంగా పోలీసులు, అధికారులను బాబా నమ్మరు. అందుకే తన భక్తుల్లో కొందరిని సెక్యూరిటీ (సేవాదార్)గా నియమించుకుంటారు” అని ఓ భక్తుడు తెలిపాడు. ఇలాంటి వాళ్లు వేలాది మంది ఉంటారన్నాడు. ఇక బాబా ఎప్పుడూ తెల్లని దుస్తులే ధరిస్తారు. వైట్ ఫార్చునర్ కారులోనే ప్రయాణిస్తారు. కారులోని సీటు కవర్లు కూడా తెలుపు రంగులోనే ఉంటాయి.